మహబూబ్ నగర్: వచ్చే సంవత్సరం నాటికి సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం పూర్తి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ వద్ద ఉన్న అయ్యప్ప గుట్టపై ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ కు మంత్రి పూజలు నిర్వహించారు. తరువాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సైన్యాన్ని తరిమికొట్టడంలో గిరిజన జాతి తెగువ, వీర పోరాటం మరువలేనివని అన్నారు.
ఎంతో ధైర్యం, తెగువ ఉన్న గిరిజన జాతి అనంతరం అడవికే పరిమితమైందని, తండాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తు వస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ గిరిజనులను ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమే కాకుండా.. గిరిజనులను సర్పంచ్ లుగా, నాయకులుగా ఎదిగేలా చేసి వారికి రాజ్యాధికారం ఇచ్చామని తెలిపారు. గతంలో తాగునీటి కోసం తండావాసులు కిలోమీటర్ల మేర వెళ్లి తెచ్చుకునే వారని, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారని అలాంటిది తమ ప్రభుత్వం వచ్చాక 24 గంటల ఉచిత విద్యుత్ సౌకర్యంతో పాటు, మిషన్ భగీరథ తాగునీరు, తాండలకు కూడా బిటి రహదారులు ఏర్పాటు చేసిన ఘనత తమదే అని అన్నారు.
మహబూబ్ నగర్లో గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా గిరిజన భవన్ కు, సంత్ సేవాలాల్ దేవాలయానికి వెయ్యి గజాల స్థలాన్ని ఇచామని తెలిపారు. దేవాలయ నిర్మాణంలో రూ.15 లక్షలు గిరిజన సంఘం ఏర్పాటు చేసినట్లయితే తన వంతుగా రూ.15 లక్షలు ఇస్తామని, వచ్చే సంవత్సరం నాటికి సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. పద్మావతి కాలనీ అయ్యప్ప కొండపై సంత్ సేవాలాల్ విగ్రహంతో పాటు, మహబూబ్ నగర్ పట్టణ ప్రధాన రహదారిపై కూడా సంత్ సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం చెప్పారు. గిరిజనుల కోసం గిరిజన భవన్ తో పాటు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, గిరిజన పాఠశాల, ఉద్యోగ భవన్, మొత్తం రూ.13 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని మంత్రి వెల్లడించారు.
Srinivas Goud visit Sevalal Maharaj Temple