హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఇదే చివరి హెచ్చరిక అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇదే పద్దతి కొనసాగితే సహించేది లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్‌ను బొందపెడతామన్నారు. బిసి నాయకులు ఎదగవద్దని కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. బిసిలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బిసిల జోలికొస్తే బిసిల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారన్నారు. బిసిలు ఇచ్చిన ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తుంటే ఆక్రోశంతో బిసిలపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మృత్యుంజయుడు ఆ జెసిబి డ్రైవర్(వైరల్ వీడియో)
బిసిలను అణిచివేయాలని లక్ష్యంతో బిసి నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు. బిసిలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకునీ టార్గెట్ చేస్తున్నారని, బిసిలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని, తమ ఓట్లతో గెలిచి బిసిలనే టార్గెట్ చేస్తున్నారని, అతి త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని, కులాల వారిగా మీటింగ్ లు పెడుతామని, ముక్కు, చెంపలు వేసుకుంటే తప్పా వారిని వదలమని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. త్వరలో కార్యాచరణ ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ బిసిలపై చేస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు.