Monday, February 24, 2025

భాషా ఉషస్సు-‘శ్రీనివాస ఛందస్సు’

- Advertisement -
- Advertisement -

ప్రతివాద భయంకర శ్రీనివాస్ ఇలా చెబితే ఎవరీయనని అడుగుతారు. ఓహోగులాబి బాల, అందాల ఓ చిలుకా పాటలు పాడిన మధుర గాయకుడని చెబితే ఓహో పి.బి.శ్రీనివాస్ గారా అంటా రు. గాయకులుగా ఎంతో మందికి తెలుసు. జీవిత చరిత్ర కూడా అందరికి తెలిసినదే. కానీ.. ఆయన గురించి తెలియని విషయాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు భాష కోసం ఆయన చేసిన సేవ అనన్య సామాన్యమని ఎరిగిన వారెంత మంది ఉన్నారో తెలీదు. ‘ఆన్ధ్రత్వమాన్ద్ర భాషాచ, నాల్పస్యతపఃఫలమ్’ని త్రికరణశుద్ధిగా నమ్మి ఆంధ్రదేశానికి దూరంగా నివసించినా, ఆ నమ్మకాన్ని నానావిధ భాషలలో అభివ్యక్తీకరించి ఆనందించి, ఆనందింపజేసిన ధన్యజీవులాయన. పి.బి.శ్రీనివాస్ 1930 సెప్టెంబర్ 22న పతివాది భయంకర వేంకట లక్ష్మణ ఫణిస్వామి, శేషగిరమ్మ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. పూర్వీకులైన ప్రతివాదిభయంకరం ఆణ్ణంగరాచార్యుల సంతతి 15వ శతాబ్దంలో ఆంధ్రదేశానికి తరలివచ్చారు.

సామర్లకోటలో ప్రతివాదిభయంకరం తిరువేంగళాచార్యులని గొప్ప పండితులు. 19వ శతాబ్దంలో సుప్రసిద్ధులు. 1862లో భాను మిత్రుని రసమంజరికి తాత్పర్య మంజరని వ్యాఖ్యను వ్రాసారు. చిన్నతనంలో శ్రీనివాస్గారికి మూడో ఏడు వరకు మాటలు రాలేదు. తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కళామతల్లి, సరస్వతీమాతలు చిన్నతనమనుకున్నారేమో. ఆయన గొంతులో మాటల జడిని కురిపించారు. తెలుగు భాషను మురిపించా రు. పసివాడి గొంతుతో ‘వసి’వాడని స్పష్టమైన వాక్కు ప్రవహించింది. విద్యాభ్యాసమంతా కాకినాడ, ఏలూరులో సాగింది. బికాం చదివారు. కామర్స్ వంటపట్టలేదు. సంగీత సాహిత్యాలను కౌగిలించుకున్నారు. తల్లే మొదటి గురువు. ఆమె విదుషీమణి. కోయిల గొంతు. రఫీ, మన్నాడే, ముఖేష్, తలత్ మహమూద్ పాటలు వినటం, తల్లిగారి వద్ద సాధన చెయ్యటం ఆయన దినచర్య. సంస్కృతాంధ్రల్లో పట్టుసాధించారు. ఆయన శ్రీనివాస్ గారిని నాటి కాకినాడ సబ్‌రిజిస్ట్రార్ అయిన బ్రహ్మశ్రీ ఈమని శంకరశాస్త్రి గారి వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆయన పి.బి. గారి గొంతు విని ఆశీర్వదించారు. తర్వాత చరిత్ర తెలుగు, కన్నడ, హిందీ తదితర 8భాషలలో పాడటం చలనచిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు అవగతమే! చెన్నైలో శ్రీనివాస్ గారికి శ్రీ బులుసు వెంకట రమణయ్య గారు శ్రీతీర్థం శ్రీధరమూర్తి గారు, శ్రీ వి.రాఘవన్ లాంటి మహనీయులసన్నిధి, కవిత్వ రంగ ప్రవీణులై చలనచిత్ర రంగంలో లబ్ధప్రతిష్ఠులైన దేవులపల్లి కృష్ణశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి, అనిశెట్టి వంటి వారి విభిన్న తరహా కవితా ప్రముఖుల స్నేహం లభించింది. అకాశవాణి, సినిమా, జర్నలిజం వంటి రంగాలలో ప్రసిద్ధులైన వారి స్నేహం వలన శ్రీనివాస్ గారు మూడింటిలోనూ మైత్రీ తనకు దొరికిందని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు.

పి.బి. వారు ఆధునికతను అభిమానించేవారు. ‘ప్రాతయనిపించుసరి క్రొత్త పథము నాది’ అనేది ఆయన అభిప్రాయం. సంగీతంలో ఆయన సంప్రదాయకతను అనుసరిస్తూనే ఆధునికతను పాటించారు. కాని, భాషా విషయంలో మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని శాసన ప్రమాణంగానే స్వీకరించాలని గురువు దొరసామిశర్మ గారు చెప్పారంటారయన. ఆ సంస్కార ఫలంగా శ్రీనివాస్‌గారు ‘ఛన్దోహీనోన శబ్దోస్తీ, నచ్ఛందఃశబ్దవర్జితః’ అన్న నమ్మకంతో భాషను అభ్యసించారు. అభిమానించారు. రావూరి దొరసామి గారి వలననే ఛందస్సులో క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేసారు. శ్రీనివాస్ గారు ఏదైనా క్రొత్తది కనుగొనాలనే ఉత్సుకతతో వర్ణ మేరువు, వర్ణపతాక, మాత్రామేరువు, మాత్రా పతాక, వర్ణ మర్క టి, మాత్రా మర్కటి వంటి ప్రసార క్రమాలను కూలంకషంగా అధ్యయనం చేసారు. కన్నడంలో ఛందో సంప్రదాయాలలో జరిగిన పరిశోధనలను తెలుసుకున్నారు. ఆరుద్ర గారి ఇంటికి సమీపంలో బి.నాగరాజారావు గారని సుప్రసిద్ధ కన్నడ పాత్రికేయులు ఉండేవారు. ఆయన గారి సౌజన్యంతో శ్రీనివాస్ గారు షట్పదీ ప్రకరణాలలో కృషి చేసారు.

పి.బి.శ్రీనివాస్ గారు కన్నడ ఛందస్సులోనూ విపరీతమైన పరిశోధనలు చేసారు. 79 అక్షరాలతో భారతీయ పద్య సాహిత్య చరిత్రలో అపూర్వమైన గాయత్రి వృత్తమును 1979లో రచించారు. అందువలననే కావచ్చు 79 అక్షరాలు కూర్చి ఉంటారంటారు. పి.బి.శ్రీనివాస్ గారి గాయత్రి వృత్తము వివిధ లఘుచ్ఛందాల సమాహార వృత్తమవుతుంది. పద్య పాదాలలోని యతిస్థానాన్ని కూడా శ్రీనివాస్ గారు నిర్దేశించారు. 79 అక్షరాల పాదంలో 1,- 13, 25, -37, 49, 61 యతిస్థానాలు మొదటి అక్షరం కాక ఐదు యతులు. వృత్తం కాబట్టి ప్రాయవియతం. దీనిని తల్లిదండ్రులకు అంకితం చేసి జననీ జనక గాయత్రీ వృత్తమన్నారు. అపూర్వ ప్రాశస్త్యోద్ధృతి కారణంగా ఈ వృత్తం ప్రసిద్ధి కావాలని ఆకాంక్షించారు. కరపత్ర గ్రంథ రూపంలో పి.బి.శ్రీనివాస్ గారు ప్రచురించిన తొలి పుస్తకం ఇదే.

ఇది 1979లో ప్రచురితమయింది. ఇదే కాక పి.బి.శ్రీనివాస్ గారు సరిక్రొత్తగా పింగళుడు, కేదారభట్టు మొదలైన ప్రాచీనుల ధోరణిలో ‘శ్రీనివాసవృత్తము’, అనే మరో క్రొత్త సృష్టిని చేసారు. ఆయన గొప్ప గాయకులు, పరిశోధకులు, భాషాభిమాని తెలుగు వారు కావటం మనందరికి గర్వకారణం. గాయకుడుగా ఆయన మొదటి చిత్రం జాతకఫలం(1954) సుమారు మూడు వేలకు పైగా పాటలు పాడారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి, కర్ణాటక ప్రభుత్వం పురస్కారం, శ్రీరాఘవేంద్ర మఠం వారి సంగీతకళానిధి పురస్కారం, ఆస్థాన సంగీత విద్వాంసునిగా, కంచి జగద్గురు పీఠంసంగీత రత్న సంగీత నాదమణి బిరుదులు, ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ గౌరవాన్ని అందుకున్నారు. రచ్చ గెలిచి నాయనకు తెలుగింట తగిన గుర్తింపు రాలేదు ఎందుకో.

భమిడిపాటి గౌరీశంకర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News