ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, సత్యేంద్రనాథ్ బోస్, మహాలనోబిస్, సి యన్ రావు, డిఆర్ కప్రేకర్, హరీష్ చంద్ర, భాస్కర, నరేంద్ర కర్మార్కర్, నీనా గుప్తా లాంటి ప్రపంచ స్థాయి భారత గణిత శాస్త్ర దిగ్గజాల సరసన చేరిన అపర బాలమేధావి మన శ్రీనివాస రామానుజన్ అయ్యర్ అని సగర్వంగా భారతీయులు తలుచుకుంటున్న ప్రత్యేక సందర్భమిది. 22 డిసెంబర్ 1887న తమిళనాడులోని నిరుపేద అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శ్రీనివాస రామానుజన్ అయ్యర్. 19వ శతాబ్దపు ప్రఖ్యాత గణిత మేధావులు యూలర్, జాకోబిల లాంటి శాస్త్రజ్ఞుల సరసన ప్రపంచ గణిత వేదికలో గణిత వెలుగులు నింపిన బాల మేధావిగా రామానుజన్ అయ్యర్ గణితశాస్త్ర చరిత్రలో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు. సంప్రదాయ పాఠశాల విద్య లేనప్పటికీ తన 12వ ఏటనే త్రికోణమితి సిద్ధాంతాలను ప్రతిపాదించిన అత్యంత ప్రతిభ గల బాల మేధావిగా శ్రీనివాస రామానుజన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 1904లో పాఠశాల విద్య పూర్తి చేసిన రామానుజన్ ఇతర సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించని కారణంగా కళాశాల విద్యలో ప్రవేశం పొందలేక డిగ్రీపట్టాకు దూరమైపోయారు.
అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామానుజన్
శ్రీనివాస రామానుజన్ ప్రతిపాదించిన గణిత సిద్ధాంతాలను పరిశీలించిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఆచార్యుడు జిహెచ్ హార్డీ చొరవతో 1917లో లండన్ ట్రినిటీ కాలేజీలో చేరి అనంత శ్రేణులకు (ఇన్ఫినిటీ సిరీస్) సంబంధించిన పలు సిద్ధాంతాలను ప్రతిపాదించారు. తన 32 ఏండ్ల స్వల్ప జీవిత కాలంలో 3,900 గణిత సిద్ధాంతాలు, సూత్రాలు, సమీకరణాలను ప్రతిపాదించగలిగారు. రామానుజన్ అయ్యర్ ప్రతిపాదనల్లో కొన్నింటిని నేటికీ ప్రపంచ గణిత శాస్త్రజ్ఞులు అర్థం చేసుకోలేకపోతున్నారు. రామానుజన్ ప్రతిభను గుర్తించి లండన్ మాథమెటికల్ సొసైటీ, ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంఘాల్లో సభ్యత్వంతో పాటు డిగ్రీ పట్టాను కూడా పొందారు. చిన్నతనం నుంచే పేదరికం కారణంగా పలు అనారోగ్యాలతో సతమతం అయ్యారు. లండన్ వాతావరణం, జీవనశైలి/ ఆహార అలవాట్లు నచ్చకపోవడంతో శ్రీనివాస రామానుజన్ ఆరోగ్య క్షీణించడంతో 1919లో భారత్‌కు తిరిగి వచ్చారు. క్షయ వ్యాధి ముదరడంతో తన 32వ ఏటనే 26 ఏప్రిల్ 1920న తుది శ్వాస విడిచారు.
రామానుజన్ ప్రతిభకు గణిత గీటురాళ్లు
రామానుజన్ ప్రతిభకు గీటురాళ్లుగా నిలిచిన గణిత శాస్త్ర రంగాలలో ముఖ్యమైనవిగా భిన్నాలు, అనంతశ్రేణి, సంఖ్యా సిద్ధాంతం, గణిత విశ్లేషణలు లాంటివి నిలిచాయి. రామానుజన్ టీటా ఫంక్షన్, పార్టీషన్ ఫార్ములా, డైవర్జంట్ సీరీస్, జీటా ఫంక్షనల్ ఈక్వేషన్, రామానుజన్ ప్రైమ్, రీమన్ సీరీస్, ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్, హైపర్ జియెమెట్రిక్ సీరీస్, మాక్ టీటా ఫంక్షన్, హార్డీ రామానుజన్ సంఖ్య (1729) లాంటి ప్రతిపాదనలు అనేకం చేశారు. భారతీయుడిగా దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన రామానుజన్ కృషిని గుర్తించిన ప్రభుత్వం 2012 నుంచి వారి పుట్టిన రోజు 22 డిసెంబర్‌న ‘జాతీయ గణితశాస్త్ర దినం’ గా పాటించుట ఆనవాయితీగా మార్చింది. ‘నేషనల్ మాథ్స్ డే’ వేదికగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, పరిశోధనా సంస్థల్లో గణితశాస్త్ర ప్రాధాన్యత, శాస్త్ర అవగాహన, గణితం పట్ల భయాన్ని తొలగించి యువతకు ప్రేరణ కల్పించడం లాంటి పలు కార్యక్రమాలు నిర్వహించడం, గణిత మేధావులను సన్మానించడం జరుగుతుంది.
అన్ని సబ్జెక్టుల్లో రారాజు గణితమే
ఆధునిక శాస్త్ర సాంకేతిక విప్లవంలో సోషల్, కామర్స్, టెక్నాలజీ, బయో/ ఫిజికల్ సైన్స్ రంగాలన్నింటిలో గణితం ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. ‘కింగ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్’గా గణితానికి గుర్తింపు ఉంది. నేటి విద్యార్థులు విధిగా గణితాన్ని చదవడం, నైపుణ్యాన్ని సాధించడం కనీస అవసరమైంది. గణితం పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి సిద్ధాంతాలను ఆకలింపు చేసుకోవడం, అభ్యాసం చేయడం, భయాన్ని వీడి పట్టుదలతో సాధన చేయడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం, తరుచుగా చేసే పొరపాట్లను గుర్తించి సవరించుకోవడం లాంటి పద్ధతులను అవలంబించాలి. 32 ఏండ్ల స్వల్ప జీవిత కాలంలో అపార గణిత పరిజ్ఞానాన్ని విశ్వానికి పరిచయం చేసిన భారత గణిత రత్నగా శ్రీనివాస రామానుజన్ జీవితం నేటి యువతకు నిత్య ప్రేరణ కావాలి. ఎంత కాలం జీవించామనేది ముఖ్యం కాదని, ఎలా జీవించాం, ఏం చేశామనేదే ప్రధానమని రామానుజన్, వివేకానందుడు లాంటి ఎందరో భారత మేధావులు మనకు మార్గ నిర్దేశం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. ఇలాంటి ప్రముఖుల ప్రేరణతో నేటి యువత తమతమ రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదగాలని ఆశిద్దాం.