Tuesday, January 21, 2025

అడుగంటిన జలాల కోసం ఆందోళన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :వర్షపాతం ..ఎగువనుంచి వచ్చే నీటి ప్రవాహాలు వా టి అంచనాలు..రిజర్వాయర్లలో నీటి నిల్వలు ..వేసవి తాగునీటి అవసరాలు ఏ మా త్రం పట్టించుకోకుండా కృష్ణానదీజలాలను ఎడా పెడా వాడేసిన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు రిజర్వార్లలో కనీస నీటిమట్టాలకు దిగువ డెడ్‌స్టో రేజికి చేరులో ఉన్న అడుగంటిన నీటికోసం ఆందోళన చెందుతున్నాయి. ఒక రాష్ట్రంపైన మరో రాష్ట్రం ఆరోపణలకు దిగుతున్నాయి. ఉన్న కొద్ది పాటి నీటినిల్వతోనే రెండు రాష్ట్రాల్లో జులై వరకూ తాగునీటి అవసరాలు తీర్చటం ఎలా అన్నదానిపై తల పట్టుకుంటున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో మిగిలిన నీటిని దక్కించుకునేందుకు కృష్ణానదీయాజమాన్య బోర్డుపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతున్నాయి. గురువారం జలసౌధలో ఉదయం 11గంటలకు బోర్డు సభ్యకార్యదర్శి డిఎం రాయపురే కన్వీనర్‌గా ఉన్న త్రి సభ్య కమిటీ సమావేశానికి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఇఎన్‌సిలు తమ తమ రాష్ట్రాల తాగునీటి అవసరాలను ఏకరువు పెట్టేందుకు సిద్దమయ్యారు.

నడుస్తున్న నీటి సంవత్సరం మే నెలతో ముగియనుంది. జూన్ నుంచి మళ్లీ వాటర్ ఇయర్ ప్రారంభం కానుంది. ఈ నీటి సంవత్సరంలో 2023జూన్ నుంచి ఈ నెల 3 వరకూ కృష్ణానది ద్వారా శ్రీశైలం జలాశయానికి 143టీఎంసీల నీరు చేరింది. ఎగువన జూరాల ప్రాజెక్టుకు 154టీఎంసీలు చేరగా ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఎత్తిపోతల పథకాలు , ప్రధాన కాలువల ద్వారా 11టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకోగా రిజర్వాయర్‌లో ఇంకా 3.26టిఎంసీల మేరకు నీటినిల్వులుఉన్నాయి. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నదుల ద్వారా ఈ నీటి సంవత్సరం అంతా కలిపి మొత్తం 143టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంది. శ్రీశైలం నుంచి తెలంగాణ, ఏపి రాష్ట్రాలు వాటి నీటి వినియోగపు అవసరాలు పోగా ,శ్రీశైలం ప్రాజెక్టునుంచి దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 120టిఎంసీల నీరు చేరుకుంది. బుధవారం నాటికి శ్రీశైలం రిజర్వాయర్‌లో 810అడుగుల నీటిమట్టం వద్ద 33.96టిఎంసీల నీరు నిలువ ఉంది. దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 512 అడుగుల వద్ద 136టిఎంసీల నీరు నిలువ ఉంది. ఇటు శ్రీశైలంలో నీటిమట్టం ఇప్పటికే డెడ్‌స్టోరేజి స్థాయికి పడిపోయింది.

నాగార్జున సాగర్‌లో కూడా 510అడుగుల డెడ్‌స్టోరేజి స్థాయికి మరో రెండు అడుగుల ఎగువకు మాత్రమేనీటి నిల్వలు ఉన్నాయి. అయితే శ్రీశైలంలో నీటిమట్టం 790అడుగుల స్థాయి వరకూ డెడ్‌స్టోరేజిలోని నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. అదే విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకూడా 505 అడుగుల స్థాయి వరకూ డెడ్‌స్టోరేజి నిలువ నీటిని వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారాఎంత నీటిలభ్యత ఉంది, ఎంత మేరకు నీటిని ఉపయోగించు కొవచ్చన్నది కృష్ణానదీయాజమాన్య బోర్డుల త్రిసభ్యకమిటీ భేటిలో కీలకం కానుంది. అంతే కాకుండా రాగల మూడు నెలల పాటు వేసవిలో తాగు నీటి అవసరాలు తీర్చాలంటే ఎంత నీరు కావాలన్నది కూడా తేల్చనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ఎంతనీరు కేటాయించాలి, ఏపిలో ఉన్న తాగునీటి అవసరాలకు ఎంత నీరు కేటాయించాలని అన్న అంశం వద్దనే రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పుట్టుకొస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపి అనధికారికంగా నీటిని తరలించిందని , ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం

, మాల్యాల లిఫ్టుల ద్వారా ఇతర బేసిన్‌కు నీటిని తరలించిందని, తనకు చేసిన కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకుందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇప్పటికే బోర్డుకు పలు మార్లు లేఖలు రాసింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణరాష్ట్రంపై ప్రత్యారోపణలకు దిగింది. కృష్ణాలో 66,34శాతం దామాషా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రానికి 35టిఎంసీల నీటిని కేటాయించగా , మొత్తం 42.39టిఎంసీలనీటిని వినియోగించుకుందని, కేటాయింపుల కంటే 7.31టిఎంసీల నీటిని అధికంగా , అనధికారికంగా వినియోగించుకుందని ఏపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు కృష్ణాబోర్డకు కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. మరో వైపు ఏపికి చేసిన 45టిఎంసీల నీటి కేటాయింపుల్లో 42.45టిఎంసీలు మాత్రమే వినియోగించుకున్నట్టు సమర్ధించుకుంటోంది. అంతే కాకుండా వేసవి తాగు నీటి అవసరాల రిత్యా నెల 8నుంచి కుడి కాల్వద్వారా 5టీఎంసీల నీటిని సాగర్ నుంచి విడుదల చేయాలని బోర్డుకు లేఖరాసింది. ప్రస్తుతం శ్రీశైలం , నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజి నీటిలో కూడా తమ వాటాలు తేల్చి అవసరాలకు తగ్గట్టుగా నీటి విడుదలకు రిలీజింగ్ ఆర్డర్లు ఇవ్వాలని త్రిసభ్య కమిటీలో పట్టుబట్టేందుకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సిద్దమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News