Saturday, July 6, 2024

శ్రీశైలం రిజర్వాయర్ పూడికకు ప్రత్యామ్నాయంగా సిద్దేశ్వరం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:నాలుగు దశాబ్ధాల కిందట కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు బురద మేటలతో పూడిక పడింది. 230టీంసీల నీటినిలువ సామర్దంతో నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్ ఎగువనుంచి వరదనీటితో కొట్టుకొచ్చిన ఇసుక మేటలతో నీటి నిలువ సామర్దం 200టిఎంసీలకు పడిపోయింది. దీంతో ప్రతియేటా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 30టిఎంసీల నీటినిలువ సామర్ధాన్ని కొల్పోయి కృష్ణాజలాలను వృధాగా సముద్రంలోకి జారవిడుచుకోవాల్సివస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టులో కూడా ఇదే విధమైన పూడిక సమస్య తలెత్తింది. కోల్పొయిన నీటినిలువను పూరించుకునేందుకు ప్రత్యామ్నాయంగా కర్టాటక ప్రభుత్వం నవలీ ప్రాజెక్టును చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది పరివాహక ప్రాంత రైతులు కూడా శ్రీశైలం ప్రాజెక్టు పూడిక సమస్యకు పరిష్కారంగా ప్రత్యామ్నాయంగా సిద్దేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలు దక్షిణ తెలంగాణ , రాయలసీమ ప్రాంతాలే అనీ, రాష్ట్ర విభజన అనంతరం కూడా విభజన అంశాల పరిష్కారంలో జాప్యం వలన నష్టపోతున్నది కూడా ఈ ప్రాంతాలేనని ఈ ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలైన దక్షిణ తెలంగాణ ,రాయలసీమ ప్రాంతాల సాగునీటి రంగ అభివృద్ధికి రాజ్యాంగబద్ధమైన హక్కులను, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను దృష్టిలో ఉంచుకొని రెండు ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ, ఏపి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేయాలనీ కోరుతున్నారు. ఈ అంశాలపై ఈ నెల ఆరో తారీఖున చేపడుతున్న చర్చలలో కృష్ణానదీ జలాలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యతనిచ్చి, వీటి పరిష్కారానికి పాటుపడాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి , చంద్రబాబు నాయుడలకు విజ్ఞప్తి చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టును పూడిక ప్రమాదం నుంచి తప్పించాలని , రెండు రాష్ట్రాల పాలిట ఆధునిక దేవాలయంలా వెలుగులు పంచుతున్న ఈ ప్రాజెక్టు జీవితకాలం పెంచాలని కోరుతున్నారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన తెలంగాణ , రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమంగా నీరందాలంటే శ్రీశైలం ఎగువన 40టీఎంసీల నీటిని నిలువ చేసుకోగల సామర్దం ఉన్న ప్రతిపాదిత సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఎంతో అవసరం అని కోరుతున్నారు.

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం :-
ఇటు తెలంగాణలోని ఆర్డిఎస్ స్థిరీకరణ కోసం , అటు రాయలసీమలో కేసికాలువ ఎల్లెల్సీ పథకాల స్థిరీకరణకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గుండ్రేవుల రిజర్వాయర్ డిపిఆర్ కు అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల త్రాగు నీటి, సాగునీటి ఇబ్బందులు తొలగింపుకు అత్యంత కీలకం. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం త్వరితగతిన సాగడానికి తెలంగాణ నుండి కూడా సానుకూల నిర్ణయం పొందాల్సిన అవసరం ఉంది.

కృష్ణానది బోర్డు విశాఖకు వద్దు:
కృష్ణానదీయాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపిలో విశాఖపట్నంకు తరలించాన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలిన రెండు రాష్ట్రాల రైతులు కోరుతున్నారు. – పోలవరం ప్రాజెక్టుకు తాత్కాలిక ప్రాజెక్టు అయినా పట్టిసీమ నిర్మాణంతో కృష్ణా డెల్టాకు శ్రీశైలం ప్రాజెక్టుతో అనుబంధం తెగిపోయింది. (బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా డెల్టాకు కేటాయించిన 80 టి ఎం సీ ల కృష్ణా జలాలను పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను పొందుతుండటం వలన, శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చెయ్యాల్సిన అవసరం లేదు.ఈ విధంగా శ్రీశైలం రిజర్వాయర్ లో ఆదా అయిన కృష్ణా జలాలపై రాష్ట్ర విభజన చట్టం ఎగువన ఉన్న తెలంగాణ ,

రాయలసీమ ప్రాజెక్టులకు హక్కు కల్పించింది. శ్రీశైలం జలాలు తెలంగాణలోని దక్షిణాది జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులకు ప్రధానంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ఎంతో అవసరం ఉంది. తెలంగాణ ఏపి లోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అత్యంత కీలకంగా మారింది. కావున కృష్ణా జలాల నిర్వహణకు శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణలోని ప్రస్తుత హైదరాబాద్, లేదకంటే కర్నూలు జిల్లాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాల రైతులు కోరుతున్నారు.

దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు:-
గోదావరి జలాల మళ్లింపుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగులు జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులకు భరోసా కల్పించాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఎస్‌ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, రాయలసీమలోని తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మిగులు జలాల మీద చేపట్టారు. ఈ ప్రాజెక్టులకు నికర జలాలు అందించే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ కు అందజేసి, ఆ విధంగా ఆదా అయినా కృష్ణా జలాలను మిగులు జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేటాయించే లక్ష్యంతో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను చేపడతాం అని ప్రకటించారు. కానీ దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని విభజన అనంతరం విస్మరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రాలకు 254 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో కేటాయింపులు చేసింది. ఈ ట్రిబ్యునల్ నోటిఫై అయిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకు కూడా వందేళ్లలో ఐదారు సంవత్సరాల్లో కూడా నీరు లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగులు జలాల మీద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కృష్ణా జలాల లభ్యత కోసం రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సి ఉందని రైతులు కోరుతున్నారు. లేదంటే నదుల అనుసంధానం నెపంతో కేంద్ర ప్రభుత్వం గోదావరి నదీజాలను కావేరి బేసిన్‌కు తరలించుకపోతుందని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News