వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె.శ్యామలరావు అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్‌ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్‌ఎస్‌డి టోకెన్లు కేటాయిస్తారు.
– తిరుపతిలో ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లను ఇస్తారు.- టోకెన్ జారీ కేంద్రాలు వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈని ఆదేశించారు. – టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తామని, టోకెన్ లేని భక్తులు తిరుమలకు వచ్చినా కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరని స్పష్టం చేశారు. – వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుండి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది.
– గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.- వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులను ఆదేశించారు. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేస్తారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్ అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు.
మహాకుంభ మేళాలో పటిష్ట ఏర్పాట్లు : టిటిడి జేఈవో గౌతమి
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ ) లో 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న మహాకుంభ మేళాలో శ్రీవారి నమూనా ఆలయం ద్వారా ఉత్తరాది భక్తులు స్వామి వారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జేఈవో గౌతమి అధికారులకు సూచించారు. టిటిడి పరిపాలనా భవనంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో టిటిడి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈవో గౌతమి మాట్లాడుతూ టిటిడి ఈవో శ్యామల రావు ఆదేశాల మేరకు 45 రోజుల పాటు సాగే మహాకుంభ మేళాకు దాదాపు 2.50 ఎకరాల విస్తీర్ణంలో టిటిడి నుండి విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు. తిరుమల తరహాలో స్వామి వారి కైంకర్యాలు చేపట్టాలని, శ్రీవారి నమూనా ఆలయానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. టిటిడి వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు.
శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహాకుంభ మేళకు సంబంధించి ప్రధాన రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని టిటిడికి కేటాయించిన స్థలంలో మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళా బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. యూపీ పోలీస్ అధికారులతో టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రయాగ్ రాజ్ లో వాతావరణానికి తగ్గట్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెడికల్ సిబ్బంది, మందులు సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్, హెల్త్ అండ్ మెడికల్ అధికారులకు సూచించారు.
మహాకుంభ మేళాకు సంబంధించి ప్రత్యేక రోజులలో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించాలని, టిటిడిలోని వివిధ శాఖలతో ప్రజా సంబంధాల శాఖ సమన్వయం చేసుకుని విసృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, డిపిపి సెక్రటరీ రఘునాథ్, డిపిపి ప్రోగ్రాం ఆఫీసర్ రాజగోపాల్. ఎస్‌ఈ (ఎలక్ట్రికల్) వేంకటేశ్వర్లు, ఎస్‌ఈ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు ఆర్. సెల్వం, శివప్రసాద్, ప్రశాంతి, గుణభూషణ్ రెడ్డి, ఏవీఎస్వో సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.