Friday, December 20, 2024

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుతాం: టిటిడి

- Advertisement -
- Advertisement -

అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు

భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు

టిటిడి ఇఒ జె. శ్యామలరావు

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టిటిడి ఇఒ జె. శ్యామలరావు చెప్పారు. అన్ని విభాగాల అధికారులు, జిల్లాయంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఇఒ గౌతమి, వీరబ్రహ్మంలతో కలిసి టిటిడిలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఇఒ సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఇఒ మీడియాతో మాట్లాడుతూ, అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో అక్టోబరు 4న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు

⁠ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. గరుడవాహనసేవ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది.

⁠భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం జరిగింది.

⁠సుమారు ఏడు లక్షల లడ్డూల బఫర్‌ స్టాక్‌ను ఉంచుకోవడం జరుగుతుంది.

టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, మరియు జిల్లా పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు.

గరుడసేవకు ప్రత్యేకంగా అదనపు భద్రత.

నిత్యం కామన్‌ కమాండ్‌ సెంటర్‌ ద్వారా భద్రత పర్యవేక్షణ.

⁠వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల, తిరుపతిలలో పలు ఇంజినీరింగ్‌ పనులు చేస్తున్నాం.

భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలు.

వాహనసేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో గ్యాలరీలు, పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు.

⁠అక్టోబర్‌ 4 నుండి 12వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదు.

తిరుమలలో గదుల లభ్యత తక్కువగా ఉన్నందున, తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేయాలని కోరుతున్నాం.

కల్యాణకట్ట, ఇతర మినీ కల్యాణకట్టలలో క్షురకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి, అదనపు సిబ్బంది ఏర్పాటు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలో అన్నప్రసాదం, పాలు, అల్పాహారం వితరణ.

తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని వైద్య కేంద్రాలు, డిస్పెన్సరీలతోపాటు పలు ప్రథమ చికిత్స కేంద్రాలు, మొబైల్‌క్లినిక్‌, అంబులెన్సులు ఏర్పాటు.

4,000 మంది శ్రీవారి సేవకులు, తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు.

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవల ప్రత్యక్ష ప్రసారం.

ఫొటో ఎగ్జిబిషన్‌, ఫలపుష్ప ప్రదర్శనశాల, ఆయుర్వేద, శిల్ప ప్రదర్శనశాలలు ఏర్పాటు.

టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, ఇతర ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి కళాబృందాలతో వాహనసేవల్లో ప్రదర్శనలు.

అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకల రద్దు.

అలిపిరి పాత చెక్‌పోస్టు, శ్రీవారిమెట్టు వద్ద ద్విచక్రవాహనాల పార్కింగ్‌ ఏర్పాటు.

జిల్లా, పోలీస్‌ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు చక్కటి సేవలందించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయని వివరించారు.

అంతకుముందు ఈవో ఇంజినీరింగ్ పనులు, అన్నప్రసాదం, దర్శనం, వసతి, పోలీసు, కళ్యాణకట్ట, రవాణా, హెచ్‌డిపిపి, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టిటిడి విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.సివి అండ్ ఎస్వో  శ్రీధర్, ఎఫ్ఎసిఎవో శ్రీబాలాజి , సిఇ నాగేశ్వరరావు, ఆలయ డెప్యూటీ ఇఒ లోకనాథం, వివిధ శాఖాధిపతులు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News