Monday, December 23, 2024

ఐఎస్‌బిఎఫ్‌సి చైర్మన్‌గా రాజమౌళి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాది జనవరిలో భారత్ వేదికగా స్కూల్స్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌తో సహా మొత్తం 8 దేశాల జట్లు పోటీ పడనున్నాయి. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్‌బిసి) ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. కాగా, ఐఎస్‌బిఎఫ్‌సి నూతన చైర్మన్‌గా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఐఎస్‌బిఎఫ్‌సి సమావేశంలో రాజమౌళిను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టమన్నారు. ఏలూరులో కళాశాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లలో ఆడినట్టు వివరించారు. ఇక పాఠశాల స్థాయి నుంచే క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. క్రికెట్ అభివృద్ధిలో తాను కూడా ముఖ్యభూమిక పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

దేశంలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదన్నారు. అయితే వారికి తగినన్ని అవకాశాలు రావడం లేదన్నారు. వారిలోని ప్రతిభను గుర్తించి తగిన శిక్షణ ఇస్తే మంచి క్రికెటర్లుగా ఎదగడం ఖాయమన్నారు. దీనికి కోసం ఐఎస్‌బిఎఫ్‌సి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుందన్నారు. ప్రతిష్టాత్మకమైన క్రికెట్ సంస్థకు గౌరవ చైర్మన్‌గా ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్రికెట్ అభివృద్ధి శాయశక్తుల కృషి చేస్తానని రాజమౌళి పేర్కొన్నారు.
వచ్చే ఏడాది స్కూల్స్ ప్రపంచకప్..
ప్రాజెక్ట్ స్కూల్ వరల్డ్‌కప్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా 766 జిల్లాల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్, ఇండియప్ స్కూల్ ఛాలెంజ్ లీగ్ పోటీలను నిర్వహించనున్నారు. ఇండియన్ స్కూల్ టాలెంట్ లీగ్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ఈ లీగ్‌లో విజేతగా నిలిచే టీమ్ స్కూల్ ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.

ప్రతిభావంతుల కోసం అన్వేషణ..
ఇండియన్ స్కూల్ టాలెంట్ లీగ్, ప్రాజెక్ట్ స్కూల్ వరల్డ్‌కప్‌లో భాగమయ్యేందుకు ఐఎస్‌బిఎఫ్‌సి.. మెగా టాలెంట్ హంట్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా 1216 ఏళ్ల లోపు ప్రతిభావంతులైన క్రికెటర్ల కోసం టాలెంట్ హంట్ నిర్వహించనున్నారు. యువ క్రికెటర్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో కూడిన 60 సెకండ్ల నిడివి గల వీడియోను ఐఎస్‌బిఎఫ్‌సి వెబ్‌సైట్ లేదా ఐఎస్‌బిఎఫ్‌సి యాప్‌లో పోస్ట్ చేయాలి. ఇక ఐఎస్‌బిఎఫ్‌సి చీఫ్ మెంటార్ దిలీప్ వెంగ్‌సర్కార్ పర్యవేక్షణలోని నిపుణుల బృందం వీడియోలను పరిశీలించి ప్రతి జిల్లా నుంచి 400 మంది క్రికెటర్లను ఎంపిక చేస్తారు. ఎంపికైన క్రికెటర్లు జిల్లా స్థాయి స్కూల్ లీగ్‌లో ఆడేందుకు అర్హత సాధిస్తారు. ఇదిలావుండగా శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఐఎస్‌బిఎఫ్‌సి వ్యవస్థాపకులు, సంస్థ సిఇఓ సునీల్ కొలనుపాక, ఐఎస్‌బిఎఫ్‌సి సంయుక్త కార్యదర్శి రాజమౌళి తనయుడు కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News