ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఏదైనా ఉందటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రం అనే చెప్పాలి. మహేష్ కెరీర్‌లో 29వ సినిమాగా మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో మొదటి సినిమాగా ఇది రూపొందుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ గురువారం సైలెంట్‌గా ముహూర్త కార్యక్రమాలు చేసేశారు. హైదరాబాద్‌లోని అల్యుమియం ఫ్యాక్టరీలో జరిగిన ఈ సినిమా ప్రారంభ వేడుకలో మహేశ్ బాబు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనట్లు సమాచారం. అయితే ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి ఫోటో లేదా వీడియో ని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చెయ్యలేదు. కానీ సినిమా అయితే ఆరంభమైంది.
మరి అధికారికంగా అనౌన్సమెంట్ కోసం అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా ఈ సినిమా కోసం మహేష్‌బాబు అద్భుతంగా మేకోవర్ అయ్యారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఉన్న రగ్‌డ్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ మూవీలో చాలా రోజుల తర్వాత కొత్త మహేశ్ బాబును చూడబోతున్నామని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుందని కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు. దుర్గా ఆర్ట్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.