కొవిడ్ ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలి
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే నెలలో జరగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి గురువారం నాడు తన కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ముందుగా పరీక్షా కేంద్రాలను సందర్శించి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 9,07,396 మంది విద్యార్థులు, పదవ తరగతి పరీక్షల కోసం 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ ప్రసారం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని, ఓఆర్‌ఎస్ పాకెట్లను, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరేందుకు ప్రత్యేకంగా ఆర్‌టిసి బస్సులను నడపాలని సూచించారు. పరీక్షా కేంద్రాల చుట్టు పక్కల జిరాక్స్ షాపులను మూసివేయాలని, 144 సెక్షన్ విధించాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్ అందుబాటులో లేకపోతే సమకూర్చుకోవాలని, ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందని మంత్రి తెలిపారు.
పరీక్షలంటే భయాందోళనలకు గురయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.