రిమాండ్ ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరతాం
కలెక్టర్‌పై దాడి దురదృష్టకరం రైతులు అధైర్యపడొద్దు: ఎస్‌సి,
ఎస్‌టి కమిషన్ చైర్మన్ వెంకటయ్య కంది జైలులో లగచర్ల
బాధితులతో భేటీ, రెండు తండాల్లో పర్యటించిన బృందం
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, లగచర్ల ఘటనలో పోలీసుల తీరు దారుణమని ఎస్‌సి, ఎస్‌టి క మిషన్ రాష్ట్ర ఛైర్మన్ బక్కి వెంకటయ్య వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనకు సంబంధించి సంగారెడ్డి జిల్లా, కంది జైలులో రిమాండ్‌లో ఉన్న వారిని సోమవారం ఆయన కలిశారు. వారి నుంచి పలు వివరాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రిమాండ్‌లో ఉన్న వారిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కోరుతామని అన్నారు. సిఎంను కలిసి లగచర్ల కేసులో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తామని తెలిపారు. లగచర్ల, రొటిబండ తండాలో కమిషన్ బృందం పర్యటించిందని పేర్కొన్నారు. ఘటన జరిగి రోజులు దాటినా ఇప్పటికీ ఆయా గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారని తెలిపారు. లగచర్లలో ఈనెల 11వ తేదీన కలెక్టర్‌పై దాడి ఘటన దురదృష్టకరమని, ఆదే సందర్భంగా అమాయకులను జైల్లో పెట్టారని విచారం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని స్థానిక ఎస్‌పికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 41 సిఆర్‌పి కింద ఎస్‌టి, ఎస్‌టి అట్రాసిటీ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వనున్నారని వివరించారు. లగచర్ల ఘటన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
రైతులెవరూ అధైర్యపడవద్దు
బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం ససేమిరా అని ప్రకటించిన నేపథ్యంలో రైతులెవరూ అధైర్యపడవద్దని ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, లగచర్ల ఫార్మా కంపెనీల భూసేకరణ ప్రజాభిప్రాయ కార్యక్రమంలో బాగంగా అధికారులపై దాడి ఘటనలో నిజనిర్ధారణ ప్రక్రియలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ సోమవారం లగచర్ల, రోటిబండతండాలలో పర్యటించింది. క మిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాం బాబు నాయక్, జిల్లె శంకర్, నీలాదేవితో కలిసి ఆయా గ్రామాల్లో రైతులను కలిసి దాడి రోజు జరిగిన ఘటన వివరాలను తెలుసుకున్నారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి గానీ, అధికారుల దృష్టికి గానీ తీసుకువెళ్ళాలని సూచించారు. రైతుల ప్రయోజనాలే లక్షంగా తమ కమిషన్ పనిచేస్తుందని అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ప్రభుత్వం భూసేకరణ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం పూనుకోదన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని హితవు పలికారు. ఈ సందర్బంగా రైతులు దాడి అనంతరం గ్రామాల్లో జరిగిన విధ్వసంకాండను కమిషన్ ప్రతినిధులకు వివరించారు. ఆ రోజు అర్ధరాత్రి దాదాపు 500 మంది పోలీసులు తమ గ్రామం, తండాలో విధ్వంసం సృష్టించారన్నారు. ప్రతి ఇంట్లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు. అధికారుల పై దాడుల్లో పాల్గొనని వారిని సైతం అరెస్టు చేశారన్నారు. పోలీసుల దాడులకు భయపడి తామంతా గ్రామాలను, తండాలను వదిలిపెట్టి పొలాల దగ్గర తలదాచుకుంటున్నామని వాపోయారు. రైతుల సమస్యలను పూర్తిగా విన్న కమిషన్ సభ్యులు వారి సమస్యల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్‌పి దృష్టికి తీసుకువెళతామని భరోసా ఇచ్చారు. అనంతరం లగచర్ల, హకీంపేట్, రోటిబండతాండ, పోలేపల్లి, పులిచర్లకుంటడండా గ్రామాల్లో భూసేకరణ వివరాలను రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.