Friday, December 20, 2024

పెట్టుబడుల రైలు

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ స్థాయి పరిశ్రమను నెలకొల్పనున్న స్టాడ్లర్ రైల్ కంపెనీ,
రూ.500కోట్లతోఫెర్రింగ్ ఫార్మా విస్తరణ, ష్నైడర్ ఎలక్ట్రిక్ అదనపు యూనిట్

మంత్రి కెటిఆర్ దావోస్
పర్యటనలో నిర్విరామంగా
రాష్ట్రానికి వస్తున్న భారీ
పెట్టుబడులు రూ.వెయ్యి కోట్లతో
ప్రైవేట్ రంగంలో కోచ్ ఫ్యాక్టరీ
నెలకొల్పడానికి ముందుకొచ్చిన
స్టాడ్లర్ రైల్ దీనితో 2500
మందికి ఉద్యోగ అవకాశాలు
రూ.500 కోట్లతో ఫెర్రింగ్ ఫార్మా
విస్తరణ ప్రణాళిక, అదనపు
యూనిట్ స్థాపనకు సిద్ధమైన
ష్నైడర్ ఎలక్ట్రిక్ కొత్తగా
లభించనున్న వెయ్యి ఉద్యోగాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ మరోసారి భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఈ నేపథ్యంలోనే రైల్ కోచ్ తయారీకి సంబంధించి రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. అందులో భాగంగా స్టాడ్లర్ రైల్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు అంగీకారం కుదరడంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ఏర్పాటు కానుంది. దీంతోపాటు మరో రెండు కంపెనీలు తమ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించడానికి ముందుకొచ్చాయి. అందులో స్విట్జర్లాం డ్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్‌తో పాటు ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల విస్తరణతో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి అదనంగా వస్తాయని ఐటి శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు. రైల్ కోచ్ తయారీ రంగానికి సంబంధించి దావోస్‌లో మంత్రి కెటిఆర్ సమక్షంలో ప్రభుత్వంతో స్టాడ్లర్ రైల్ కంపెనీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ముందుకొచ్చింది.

ఈ ప్రాజెక్ట్‌తో దాదాపు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మేథో సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్, స్టాడ్లర్ రైల్‌లు కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి. దావోస్‌లో పర్యటిస్తున్న మంత్రి కెటిఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. ఈ మేరకు స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్‌గార్డ్ బ్రోక్ మెయ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌లు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో అవగాహన ఒప్పందంపై మంత్రి కెటిఆర్ సమక్షంలో సంతకాలు చేశారు.

ఏషియా పసిఫిక్ రీజియన్‌లకు సైతం ఎగుమతి

రానున్న రెండు సంవత్సరాల్లో తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్‌లను కేవలం భారతదేశం కోసం మాత్రమే కాకుండా ఏషియా పసిఫిక్ రీజియన్‌లకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ పెడుతున్న వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్స్‌గార్డ్ బ్రోక్ మెయ్ తెలిపారు. తమ కంపెనీ ఏషియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమకు అందిస్తున్న సహకారంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ధన్యవాదాలు: మంత్రి కెటిఆర్

రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకొచ్చిన స్టాడ్లర్ రైల్ కంపెనీకి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం నుంచి భారతదేశానికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేలా రైల్వే కోచ్‌లను తయారు చేయడంపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు ఆకర్శణీయ గమ్యస్థానంగా మారిందన్న విషయాన్ని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు. కంపెనీ పెడుతున్న రూ.1000 కోట్ల పెట్టుబడి ద్వారా సుమారుగా 2500ల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
మంత్రి కెటిఆర్‌తో ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధుల వెల్లడి
రూ.500 కోట్లతో విస్తరణ ప్రణాళిక

తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణను ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా ప్రకటించింది. క్రోన్, అల్సారేటివ్ కోలైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే తన ట్రేడ్ మార్క్ pentasa (పెంటసా)ను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేసేందుకు ఈ నూతన ప్లాంట్ ను వినియోగించుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కెటిఆర్ తో ఫెర్రింగ్ ఫార్మా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌తో వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద మేసాలజైన్ (Mesalazine), అక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్- ఏపిఐ (API) తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల నుంచి తన ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటికి అదనంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో తన ఫార్ములేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. మంత్రి కెటిఆర్‌తో దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో ఫెర్రింగ్ ఫార్మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లేసండ్రో గిలియో ( Mr. Alessandro Gilio) ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు.

ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్‌లో తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం నెలరోజుల క్రితమే కంపెనీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించానని, ఇంత త్వరగా కంపెనీ అదనంగా మరో 60 మిలియన్ల యూరోల (రూ.500 కోట్ల)ను పెట్టుబడిగా పెట్టడం తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలకు నిదర్శనమన్నారు. కేవలం దేశీయ కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ విదేశీ కంపెనీలకు సైతం తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందన్న విషయాన్ని ఈ పెట్టుబడి ప్రకటన నిరూపిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాపార, వాణిజ్య, ఉపాధి కల్పన అనుకూల కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమయ్యిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో తన విస్తరణకు పెట్టుబడి పెడుతున్న ఫెర్రింగ్ ఫార్మాకు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో మరో యూనిట్‌ను ప్రారంభించనున్న ష్నైడర్ ఎలక్ట్రిక్

ష్నైడర్ ఎలెక్ట్రిక్ అదనపు యూనిట్ స్థాపనతో 1,000 కొత్త ఉద్యోగాలు

తెలంగాణలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ బుధవారం ప్రకటించింది. మంత్రి కెటిఆర్‌తో కలిసి దావోస్‌లో సమావేశమైన ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ ఈ మేరకు కంపెనీ తరఫున ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగుతున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా అడ్వాన్సుస్డ్ లైట్ హౌస్ అవార్డుని దావోస్ వరల్ ఎకనామిక్ ఫోరంలో పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఐఐఓటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రెడిక్టివ్, ప్రిస్‌క్ట్రిపివ్ అనాలస్టిస్, ఏ1 డీప్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను వాడినందుకు ఈ అవార్డు దక్కినట్లుగా రిమోంట్ తెలిపారు.

తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ నూతన తయారీ ప్లాంట్ నుంచి ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్ ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని పెట్టుబడులకు రాజధానిగా మార్చేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపిన మంత్రి కెటిఆర్, తమ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ష్నైడర్ ఎలక్ట్రిక్ తన తయారీ పరిశ్రమను విస్తరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ అదనపు తయారీ యూనిట్ వలన 1,000 నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఈ కంపెనీకి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

గ్లోబల్ ఫార్మా మేజర్ రోచె చైర్మన్‌తో మంత్రి కెటిఆర్ భేటీ

దావోస్‌లో గ్లోబల్ ఫార్మా మేజర్ రోచె చైర్మన్ డాక్టర్ క్రిస్టోఫ్ ఫ్రాంజ్‌ని మంత్రి కెటిఆర్ కలిశారు. హైదరాబాద్ ఫార్మా సిటీ, జీనోమ్ వ్యాలీ, మెడ్‌టెక్ పార్క్ తదితరాల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ వైబ్రెంట్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ గురించి మంత్రి కెటిఆర్ ఆయనకు వివరించారు. నాణ్యమైన మందులను అభివృద్ధి చేయడంతోపాటు రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కెటిఆర్ పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్‌లో భాగం కావాలని ఫ్రాంజ్‌ని మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు. రోచె అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బయోటెక్ కంపెనీ. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి సైన్స్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్స్, డయాగ్నస్టిక్స్‌లో అగ్రగామి. రోచె దాని విట్రో డయాగ్నస్టిక్స్, టిష్యూ-బేస్డ్ క్యాన్సర్ డయాగ్నస్టిక్స్‌కు ప్రసిద్ధి చెందింది. దీంతోపాటు మధుమేహానికి మందును కనిపెట్టడంలో రోచె ముందుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News