న్యూఢిల్లీ: ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాలకు చెందిన దాదాపు 1800 మందిని ప్రత్యేక ఆతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన తెలిపింది.ఈ అతిథుల్లో 400 మంది సర్పంచులు(వైబ్రెంట్ విలేజెస్), వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు చెందిన 250 మంది, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం,
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం లబ్ధిదారులతో పాటుగాఉపాధ్యాయులు, నర్సులు, మత్సకారులు, శ్రామికులు తదితరులు ఉన్నట్లు ఆ ప్రకటన తెలిపింది. అలాగే ఎర్రకోట వద్ద జరిగే వేడులను వీక్షించడానికి ప్రతి రాష్ట్రంనుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన 75 జంటలను కూడా ఆహ్వానించినట్లు ఆ ప్రకటన తెలిపింది. వీరే కాకుండా దాదాపు 17,000 మంది అతిథులకు ఈ ఇన్విటేషన్లు జారీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అతిథుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.
ప్రత్యేక సెల్ఫీ పాయింట్లు ..పోటీలు
ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సెల్ఫీ పోటీలను కూడా నిర్వహించి బహేమతులను కూడా అందజేయనున్నారు.‘వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి నగరం( ఢిల్లీ)లో 12 చోట్ల ప్రత్యేక సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఆ పాయింట్ల వద్ద ఫోటోలు తీసుకుని‘ మై గవ్’ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.సెల్ఫీలు పంపిన వారిలో 12 మందిని ఎంపిక చేసి రూ.10 వేల చొప్పున బహుమతులు అందజేస్తాం’ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో 2021 మార్చి12న ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం వద్ద ప్రారంభించిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ముగుస్తాయని ఆ ప్రకటన తెలిపింది. కాగా స్వ్తాంత్య్ర దినోత్సవ వేడుకల సన్నాహకంగా ఆదివారం నగరంలో సైనిక దళాల ఫుల్ డ్రెస్ రిహార్సల్ జరగనుంది. ఈ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.