స్థానిక జనంతో రద్దీగా మారిన పలు బస్తీదవఖానలు
చలితో జలుబు, దగ్గు వ్యాధులతో బాధపడుతున్నట్లు రోగులు వెల్లడి
రోజుకు 45నుంచి 50 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
వైరస్ నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పదంటున్న వైద్యాధికారులు
హైదరాబాద్: నగరంలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. విదేశాల నుంచి వచ్చే వారి నుంచి వైరస్ బయటపడటంతో వారి బంధుమిత్రులు, స్నేహితులకు కూడా సోకే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీపంలోని బస్తీదావఖానలకు వెళ్లి ర్యాపిడ్ టెస్టులు కోసం గంటల తరబడి క్యూలో నిలబడి పరీక్షలు చేసుకుంటున్నారు. చలితీవ్రత ఒమిక్రాన్ విస్తరణతో వైద్యశాఖ టెస్టులు పెంచాలని సిబ్బందికి సూచనలు చేసి రోజుకు 50మంది వరకు టెస్టులు చేస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు బయటపడ్డ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు టెస్టుల కోసం వందలాదిమంది బారులు కడుతున్నట్లు స్దానిక వైద్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. సంక్రాంతి పండగవరకు టెస్టుల కోసం జనం సంఖ్య రెండింతలు పెరగవచ్చని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు.
చలి ప్రభావంతో దగ్గు, జలుబు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు సీజనల్ వ్యాధులా , కరోనా వైరస్ అంటూ భయపడుతూ వ్యాధులు నిర్దారణ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు కొత్తవేరియంట్లు పుట్టుకరావడంతో థర్డ్‌వేవ్ వస్తుందనే భయంతో ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్దానికులు చెబుతున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండి రోగులకు పలు రకాల సేవలందిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. నగరంలో 258 బస్తీదవఖానలతో పాటు, 98 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని వైద్యశాఖ పేర్కొనడంతో నగర ప్రజలు వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకుంటున్నారని ఆరోగ్య కార్యకర్తలు వివరిస్తున్నారు. దీని దృష్టిలో పెట్టుకుని సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్నారు. వచ్చే నెల రోజుల పాటు వరుసగా పండగలు ఉండటంతో కరోనా ఉనికిచాటే అవకాశముందని, వేడుకలను పరిమిత సంఖ్యలో చేయాలని, ఒకే దగ్గర గుంపులుగా ఉండి విందులు చేస్తే మహమ్మారి పంజా విసురుతుందని, ఇప్పటికి రోజు 70 నుంచి 82 వరకు పాజిటివ్ కేసులు నమోదైతున్నట్లు, ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించి, ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.