Sunday, December 22, 2024

బహిరంగ ప్రదేశాల్లో మద్యపానానికి స్టాలిన్ సర్కార్ ‘ప్రత్యేక లెసెన్స్’

- Advertisement -
- Advertisement -

చెన్నై: లిక్కర్ పాలసీపై స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని క్రీడా మైదానాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానానికి అనుమతులిచ్చింది. కన్వెన్షన్ సెంటర్లు, కల్యాణ మండపాలు, బ్యాంక్వెట్ క్రీడా మైదానాలు, సమావేశ మందిరాలతోపాటు ఇళ్లల్లో చేసుకునే వేడుకల్లో మద్యం అందించేందుకు ప్రత్యేక లైసెన్స్ విధానాన్ని స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు తమిళనాడు లిక్కర్ పాలసీ (లైసెన్స్ అండ్ పర్మిట్) 1981లో సవరణలు చేసింది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే అతిథులు, సందర్శకులు, పార్టిసిపేంట్స్‌కు మద్యం అందించాలంటే ప్రత్యేక లైసెన్స్ తప్పనిసరి చేసింది. అదేవిధంగా విందులు, వేడుకలు, వాణిజ్యేతర ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో అతిథులుకు మద్యం అందించాలన్నా లైసెన్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. స్టాలిన్ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం స్పెషల్ లైసెన్స్ రుసుం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో రూ.లక్ష, మున్సిపాలిటీ ఏరియాల్లో రూ.75వేలు, ఇతర ప్రాంతాల్లో రూ.50వేలు ఏడాది కాలానికి చెల్లించాలి.

కేవలం ఒక్కరోజుకు మాత్రమే అనుమతి తీసుకోవాలనుకుంటే మునిపల్ కార్పొరేషన్‌లో రూ.11వేలు, మున్పిపాలిటీల్లో రూ.7,500, ఇతర ప్రాంతాల్లో రూ.5వేలు చెల్లించాలి. తమిళనాడులో మద్యం విక్రయాలు పరిమితం చేసేందుకు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించిన విధానం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. కాగా ఇళ్లల్లో నిర్వహించే వేడుకలకు హాజరయ్యే అతిథులకు మద్యం సరఫరా చేయాలన్నా ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాలంటే పోలీస్ కమిషనర్, జిల్లాల్లో ఎస్‌పి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా లైసెన్స్ తీసుకున్నవారు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హోల్‌సేల్ డిపో నుంచి మద్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన మద్యాన్ని ఎక్సైజ్‌శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆమోదించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రత్యేక లైసెన్స్ కోసం దరఖాస్తును ఈవెంట్ జరిగే వారం రోజుల ముందుగా సమర్పించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News