Monday, November 18, 2024

కరుణానిధి బిడ్డను.. కాళ్లు మొక్కే వాడిని కాను

- Advertisement -
- Advertisement -

Stalin reacted strongly to the IT raids

 

మోడీపై డిఎంకె నేత స్టాలిన్ ఫైర్
కూతురు, కుమారుడి ఇళ్లపై ఐటి దాడులు
మీసా ఎమర్జెన్సీలనే లెక్కచేయలేదు
ప్రచార తుది దశలో తమిళనాట కలకలం

చెన్నై/పెరంబలూర్ : ‘నేను ఎంకె స్టాలిన్‌ను. కరుణానిధి బిడ్డను . బిజెపి బెదిరింపులకు భయపడేది లేదు. ఈ విషయాన్ని మోడీ తెలుసుకుంటే మంచిది’ అని డిఎంకె అధ్యక్షులు స్టాలిన్ స్పందించారు. తన కుమార్తె , అల్లుడు, కుమారుడి నివాసాలపై శుక్రవారం ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ వరుస దాడులు, సోదాలు జరపడంపై స్టాలిన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇటువంటి డొంకతిరుగుడు వ్యవహారాలకు భయపడేది లేదని, స్టాలిన్ ఇంతకు ముదు ఎమర్జెన్సీ, మీసా వంటి పరిస్థితిని కూడా ఎదుర్కొన్న వ్యక్తి అని చెప్పారు. ఐటి దాడులకు తాము భయపడేది లేదన్నారు. అన్నాడిఎంకె నేతల మాదిరిగా సాష్టాంగ దండాలకు దిగుతామని మోడీ అనుకోరాదని, తమ రూటే వేరని స్టాలిన్ తేల్చిచెప్పారు. రాజకీయ నాయకులను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు గతంలో కాంగ్రెస్ మీసా వంటి వాటిని దుర్వినియోగపర్చిందని, ఇప్పుడు మోడీ సర్కారు ఐటి ఇతర కేంద్ర సంస్థలను వాడుకుంటున్నాడని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తన కూతురి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలకు దిగిందని , ఇటువంటి బెదిరింపులు కొత్తేమి కాదని స్టాలిన్ చెప్పారు.

ఈ నెల 6వ తేదీన పోలింగ్ నాడే తమిళ ప్రజలు తగు తీర్పు వెలువరిస్తారని తెలిపారు. స్టాలిన్ కూతురు సెంతామరాయి, అల్లుడు మోహన్ సబరీసన్‌కు చెందిన నిలాంరాయ్ నివాసాలపై ఐటి దాడికి దిగింది. చెన్నై శివార్లలోనే ఈ నివాసాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి ఈ ఇళ్ల నుంచి భారీ స్థాయిలో డబ్బు చేరవేతలు, పంపిణీలు జరుగుతున్నాయనే సమాచారంతో ఐటి దాడులు చేపట్టినట్లు వెల్లడైంది. ఉదయం 8 గంటలకు సోదాలు చేపట్టారు. ఈ విషయంపై డిఎంకె ఎన్నికల సంఘానికి వెంటనే ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచార తుది దశలో రాజకీయ ప్రత్యర్థి పార్టీలను భయభ్రాంతులను చేసేందుకే బిజెపి ఈ విధంగా ఐటి వారిని ఉసిగొల్పిందని పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే అవుతుందన్నారు. రాష్ట్రంలో బిజెపి అన్నాడిఎంకె విజయావకాశాలను బలోపేతం చేసే విధంగా ఐటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఐటి చర్యలను వెంటనే అడ్డుకోవల్సి ఉందన్నారు.

ఇక స్టాలిన్ కుమారుడు, అన్నానగర్‌లో డిఎంకె అభ్యర్థి అయిన కార్తిక్ నివాసాలపై కూడా ఐటి దాడులు జరిగాయి. అల్లుడు సబరీశన్ డిఎంకె ప్రధాన వ్యూహకర్తల బృందంలో ఒకరిగా ఉన్నారు. స్టాలిన్‌కు సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. విషయాలన్ని తనకు తెలుస్తూనే వచ్చాయని పెరంబలూర్‌లో జరిగిన సభలో స్టాలిన్ చెప్పారు. చెన్నైలో కూతురి ఇంటిపై దాడికి దిగారు. ప్రధాని మోడీ నేరుగా వచ్చి ఇక్కడి అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని పరిరక్షించే విధంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. తాము అన్నాడిఎంకె వారిమి కామని, డిఎంకె వారిమని, ఈ విషయం మోడీ మరవవద్దని, తాను కళైంగర్ కరుణానిధి బిడ్డను అని ,బెదిరిస్తే లొంగేవాడిని కానని తేల్చిచెప్పారు. సోదాలు జరుగుతున్న నీలాంగరై నివాసాల వద్దకు భారీ సంఖ్యలో డిఎంకె నేతలు, మద్దతుదార్లు చేరుకున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు డిఎంకె ర్యాలీని తలపిస్తోందని స్టాలిన్ స్పందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News