హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇన్నాళ్లు మాన్యువల్‌గా కొనసాగిన స్టాంపుల విక్రయాలు ఇక నుంచి ఆన్‌లైన్ కొనుగోలు చేసేలా నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. స్టాంపు వెండర్లు బహిరంగ మార్కెట్‌లో నేరుగా విక్రయించడాన్ని నియంత్రించిన ప్రభుత్వం స్టాంపు కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాకే వాటిని విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్రమాలకు పూర్తిగా చెక్ పడడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏ రోజు ఎన్ని విక్రయాలు…..
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అనుమతి పొందిన స్టాంప్ వెండర్లకు సబ్ రిజిస్ట్రార్ల మాదిరిగానే ప్రత్యేక లాగిన్ ఇవ్వడంతో పాటు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా కేటాయించారు. వారు ఆ లాగిన్ ద్వారా స్టాంపుల విక్రయాలను చేపట్టాల్సి ఉంటుంది. బాండ్ పేపర్లు సైతం ఇదే విధానంలో అమ్మనున్నారు. దీంతో రోజువారీగా ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎన్ని స్టాంపులు, బాండ్ పేపర్లు విక్రయించారన్న విషయం పక్కాగా తేలనుంది.
సెల్‌ఫోన్ ద్వారా దరఖాస్తు
స్టాంప్ పేపర్‌లను కొనుగోలు చేయాలనుకునేవారు సెల్‌ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్లో టియాప్ పోలియో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోకి వెళ్లాలి. స్టాంప్స్‌పై క్లిక్ చేసి తమకు అవసరమైన వాటి వివరాలు నమోదు చేసి డబ్బులు చెల్లించాలి. అనంతరం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి స్టాంపులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
పాత తేదీలతో మోసాలు…
గతంలో స్టాంపులను మాన్యువల్‌గా విక్రయించే సమయంలో పలువురు పాత తేదీలు వేసి అక్రమాలకు పాల్పడేవారు. భూములకు సంబంధించిన కార్యకలాపాల్లో ఈ తరహాలోనే మోసాలు అధికంగా జరిగాయి. స్టాంపు వెండర్లు సైతం వినియోగదారుల అవసరానికి అనుగుణంగా అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసేవారు. దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది.
కొత్త విధానం ద్వారా….
రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న వెండర్ వద్దకు వెళ్లగానే ముందుగా ఆన్‌లైన్ ప్రత్యేక లాగిన్‌లో వారి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, స్టాంప్ పేపరుపై ఉన్న క్రమ సంఖ్యను నమోదు చేసి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్ని వివరాలు సరిగా ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఆ క్షణంలో కొనుగోదారులతో పాటు ఇతర వివరాలన్నీ నిక్షిప్తమవుతాయి. ఏ స్టాంపు వెండర్ ఏ రోజు ఎన్ని స్టాంపు పత్రాలను విక్రయించాడన్నది సంబంధిత శాఖ అధికారులకు తెలిసిపోతుంది. ఇకపై పాత తేదీతో బాండ్లను తీసుకోవడం కుదరదు.