Friday, February 21, 2025

ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే!

- Advertisement -
- Advertisement -

కుంభమేళాలో తొక్కిసలాట జరిగి మూడు వారాలు కూడా కాకముందే తాజాగా జరిగిన అలాంటి దుర్ఘటనే 18 మందిని బలిగొంది. కాకపోతే, ఈసారి అందుకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ కేంద్ర బిందువైంది.ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్లాట్ ఫాంపై వేచిచూస్తున్న ప్రయాణికులను అదే సమయంలో మరొక ప్లాట్ ఫామ్ పైకి వచ్చిన ప్రయాగ్ రాజ్ స్పెషల్ ట్రెయిన్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ గందరగోళానికి గురిచేసింది. తాము ఎక్కవలసిన ‘ప్రయాగ్ రాజ్’ రైలు అదేననుకుని ప్రయాణికులంతా అక్కడికి పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగిందనేది ప్రత్యక్ష సాక్షుల కథనం కాగా, ఎప్పటిలాగే ఇందులో తమ తప్పు ఏమీ లేదని తప్పించుకునేందుకు రైల్వే యంత్రాంగం సాకులు వెదుకుతోంది.

ప్రయాణికుల రద్దీతో ప్లాట్ ఫారాలు కిటకిటలాడుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చునని ఊహించకపోవడం  రైల్వే అధికారుల తప్పుకాకుండా పోతుందా? స్టేషన్లోనే ఉండే రైల్వే పోలీసులు ఆ సమయంలో ఏం చేస్తున్నట్టు వంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. వేలాది మంది గుమిగూడిన చోట ఓ పద్ధతీపాడూ ఉండదు. వరుసలో నిలబడి ఒకరి తరువాత ఒకరుగా వెళ్లాలన్న ఆలోచన, క్రమశిక్షణ ఇండియాలాంటి దేశాల్లో అరుదుగా కనిపించే దృశ్యమనే చెప్పాలి. సినిమా థియేటరైనా, భక్తిభావం ఉట్టిపడే ఆలయమైనా అందరినీ తోసుకుంటూ ముందుగా వెళ్లి.. దొరికితే సీటు లేదంటే కాస్త చోటు సంపాదించాలన్న ఆతృతే ఇలాంటి తొక్కిసలాటలకు కారణమవుతోంది. అలాంటి సందర్భాల్లో ఓ చిన్న వదంతి కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేందుకు దోహదపడుతుంది. తొక్కిసలాటల నివారణపై గతంలో ఓ అంతర్జాతీయ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం భారతదేశంలో మతపరమైన కార్యక్రమాలు, యాత్రాస్థలాల్లోనే 80శాతం వరకూ తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్నట్లు స్పష్టం చేసిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన ఇండియాలో సభ జరిగినా, సమావేశం జరిగినా, వన్డే మ్యాచ్ జరిగినా, ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా జనం అంచనాలకుమించి తండోపతండాలుగా రావడం జరుగుతూనే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో జనాన్ని అదుపు చేసేందుకు పాలనాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుందనేది ముఖ్యం. మతపరమైన వేడుకలు, సభలు, జాతరలు, పుష్కరాలు, కుంభమేళాలకు జనం మరీ విరగబడతారు. కుంభమేళాలలో తొక్కిసలాట సర్వసాధారణమైపోయింది. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1954లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 800 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇంత పెద్ద సంఖ్యలో జనసమూహాలు గుమిగూడినప్పుడు జరిగే అనర్థాలను ముందుగా అంచనా వేసి తగిన భద్రతా ఏర్పాట్లను చేపట్టడంలోనే పాలనాయంత్రాంగం శక్తిసామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. మూడు వారాల క్రితం కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలోనూ, మొన్న న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన దుర్ఘటనలోనూ పరిస్థితిని అంచనా వేయడంలో అధికారయంత్రాంగం ఘోరంగా విఫలమైంది.

కుంభమేళా మొదలైనప్పటినుంచీ ఉత్తరాదిన పలు రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాగ్‌రాజ్ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు వేసినా, అవి ఏమూలకూ చాలడం లేదు. గత వారం రోజులుగా ఢిల్లీ, పాట్నా, ప్రయాగ్‌రాజ్ తదితర రైల్వేస్టేషన్లలో జనం ఇసుకవేస్తే రాలనట్లుగా ఉన్నప్పటికీ, రద్దీని నియంత్రించేందుకు చేపట్టిన చర్యలు శూన్యం. విఐపిలను పెద్ద సంఖ్యలో అనుమతించి, సాధారణ ప్రజానీకాన్ని పుణ్యస్నానాలు చేయకుండా నియంత్రించడమే కుంభమేళాలో తొక్కిసలాటకు దారితీసిందనీ, రైళ్ల రాకపోకలపై నెలకొన్న గందరగోళమే న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ లో 18 మంది ప్రాణాలు బలిగొందనీ అంటున్నారు. దుర్ఘటనలు జరగకుండా చూడవలసిన యంత్రాం గం చేష్టలుడిగి చూస్తూ కూర్చుంటోందనడానికి తాజా సంఘటనే ఉదాహరణ.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా దుర్ఘటన జరిగాక హడావిడి చేయడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ప్రమాదం జరిగాక, పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలసిపోయాక ప్రభుత్వాలు ఆదరాబాదరా దర్యాప్తునకు ఆదేశించడం, సదరు దర్యాప్తు సంఘం ప్రమాదానికి గల కారణాలను శోధించి, ప్రభుత్వాలకు నివేదిక అందించడం పరిపాటిగా మారింది. ఈలోగా మృతుల కుటుంబాలకు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి, పాలకులు తమ ఔదార్యాన్ని చాటుకుంటూ ఉంటారు. తాజా సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరిపి, నిజాలను నిగ్గు తీయడమే కాదు, బాధ్యులెవరో గుర్తించి తగిన విధంగా శిక్షిస్తే, మరొకసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News