రైళ్ల ప్రయాణంపై తారుమారు ప్రకటనలతో జనం హడావిడి
‘ప్రయాగ్‌రాజ్’ పేరిట ఒక ఎక్స్‌ప్రెస్, ఒక స్పెషల్ రైలు మరో కారణం
42 మెట్ల ఇరుకైన మార్గం కూడా దోహదం చేసింది
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 25 అడుగుల వెడల్పు గల ఫుట్ ఓవర్‌బ్రిడ్జిపైకి వెళ్లే 42 మెట్లు ఉన్న ఇరుకైన మెట్లమార్గం భీతాహ, సంక్షుభిత పరిస్థితికి దారి తీసింది. అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మరణించగా, డజను మందికి పైగా గాయపడ్డారు. మెట్ల మార్గం, బ్రిడ్జి, ప్లాట్‌ఫారాలు 14, 15లపై చెల్లాచెదురుగా పడి ఉన్న స్లిప్పర్లు, చినిగిన బ్యాగులు, ప్రయాణికులు వదలివేసిన వస్తువులు శనివారం రాత్రి సంభవించిన ఆ దుర్ఘటనకు మౌన సాక్షులుగా కనిపించాయి. శనివారం రాత్రి 9.55 గంటలకు తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఆ సమయంలో వేలాది మంది ప్రయాణికులతో స్టేషన్ కిక్కిరిసిపోయి ఉంది. వారిలో అధిక సంఖ్యాకులు మహా కుంభమేళా యాత్రికులు. రైళ్ల ప్రయాణం గురించి తారుమారైన ప్రకటనలు గందరగోళానికి, భీతాహ స్థితికి దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ‘ప్రయాగ్‌రాజ్’ పేరుతో మొదలయ్యే రెండు రైళ్ల గురించిన ప్రకటన వల్ల ఈ గందరగోళం ఏర్పడిందని ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. ‘ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ అప్పటికే ప్లాట్‌ఫారమ్ 14పై ఉండగా, ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు ప్లాట్‌ఫారమ్ 16పైకి వస్తోందన్న ప్రకటన గందరగోళానికి దారి తీసింది.
ప్లాట్‌ఫారమ్ 14పై గల తమ రైలును చేరుకోలేకపోయినవారు తమ రైలు ప్లాట్‌ఫారమ్ 16 పైకి వస్తోందని భావించడం తొక్కిసలాటకు దారి తీసింది. అదనంగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు నాలుగు ఉన్నాయి. వాటిలో మూడు ఆలస్యమయ్యాయి. దానితో అనూహ్యంగా ప్రయాణికులు కిక్కిరిసిపోయారు’ అని పోలీస్ అధికారి ఒకరు వివరించారు. మరి రెండు రైళ్లు స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ అప్పటికే ఆలస్యమయ్యాయి. దీనితో ప్లాట్‌ఫారాలు 13, 14, 15 దిక్కు తోచని ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. అప్పుడే ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలు ప్లాట్‌ఫారమ్ 16 నుంచి బయలుదేరుతుందనే ప్రకటన వచ్చింది. ‘ప్రయాగ్‌రాజ్‌కు ఒక రైలు (ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్) అప్పటికే ప్లాట్‌ఫారమ్ 14పై ఉన్నది. ప్రత్యేక రైలు గురించిన ప్రకటన వచ్చినప్పుడు చాలా మంది ప్రయాణికులు అది తమ రైలు అని భావించి, ప్లాట్‌ఫారమ్ 16 వైపు హుటాహుటిని బయలుదేరి వెళ్లారు’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
ప్లాట్‌ఫారమ్ 16కు వెళ్లేందుకు ఏకైక మార్గం 25 అడుగుల వెడల్పు గల ఫుట్ ఓవర్‌బ్రిడ్జికి దారి తీసే 42 మెట్ల మార్గం. వేలాది మంది ముందుకు చొచ్చుకుపోతుండడంతో మెట్లమార్గం ప్రమాదకరంగా జనంతో కిక్కిరిసిపోయింది. మెట్లు ఎక్కుతున్నవారికి దిగేయత్నం చేస్తున్నవారు అడ్డువచ్చారు. దీనితో అక్కడ ప్రధాన అవరోధం ఏర్పడింది. ‘జన సమూహం బలం దుర్భరం. జనం చిక్కుకుపోయారు, కదలలేకపోయారు, కొందరు నిలదొక్కుకోలేక కింద పడ్డారు. వారు ఇతరులను తమతో లాక్కున్నారు’ అని ప్రత్యక్ష సాక్షి జ్ఞానేందర్ సింగ్ చెప్పారు. భీతాహ స్థితి నెలకొంది. జనం కేకలు మిన్నంటాయి. ‘అరే రుక్ జావ్, లోగ్ మర్ రహే హైఁ’ అని ఒకరు అరిచారు. కాని అతని గొంతు తొక్కిసలాటలో ఇతరులకు వినిపించలేదు. వెనుక నుంచి తోపుడు ఎక్కువ అవుతుండడంతో అనేక మంది, ముఖ్యంగా మహిళలు, వృద్ధ ప్రయాణికులు కింద పడిపోయి, ఇతరుల కాళ్ల కింద నలిగిపోయారు.
‘నేను కదలలేకపోయాను. జనం నాపై పడిపోతున్నారు’ అని వణుకుతున్న స్వరంతో ఒకరు చెప్పారు. రక్షణ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఒక రైల్వే కార్మికుడు అక్కడి దృశ్యాన్ని తాను చూసిన అత్యంత దారుణ విపత్తుల్లో ఒకటిగా అభివర్ణించారు. ‘జనానికి తమ వస్తువులు చేతికి తీసుకునే వ్యవధి లేకపోయింది. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీశారు. జత లేని పాదరక్షలు దొరికాయి. విరిగిన గాజులు నేలపై చెల్లాచెడురుగా పడి ఉన్నాయి. ఒక పిల్లవాడి బ్యాగు దొరికింది’ అని ఆ కార్మికుడు తెలిపారు. పరిమితికి మించిన ప్రయాణికులు ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అని రైల్వే అధికారులు ఒప్పుకున్నారు. గంటకు 1500 వంతున జనరల్ టిక్కెట్లు విక్రయిస్తుండడంతో ప్రయాణికుల రద్దీని నియంత్రించడం దాదాపు అసాధ్యంగా మారింది. అధికారులు ఆ తరువాత భద్రతను కట్టుదిట్టం చేసి, ఎక్కడ తప్పు జరిగిందో నిర్ధారించేందుకు, అటువంటి ఘటనలు నివారించేందుకు దర్యాప్తును ప్రారంభించారు. ఆదివారం ఉదయానికి స్టేషన్‌లో తిరిగి మామూలుగా కార్యకలాపాలు సాగాయి. కానీ శనివారం రాత్రి ఘటన మచ్చలు చెరిగిపోనివి.