Monday, December 23, 2024

త్రికూట పర్వతాల్లో తొక్కిసలాట

- Advertisement -
- Advertisement -

Stampede at the Mata Vaishno Devi temple:16 dead

మాతా వైష్ణోదేవి ఆలయ ఘటనలో 12మంది భక్తుల దుర్మరణం
మరో 16 మందికి గాయాలు, యువకుల మధ్య గొడవే కారణం!

జమ్మూ: నూతన సంవత్సరం వేళ జమ్మూ, కశ్మీర్‌లో విషాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది భక్తులు మృతి చెందగా,12 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్‌బాగ్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు ఢిల్లీ,పంజాబ్, హర్యానా, జమ్మూ, కశ్మీర్‌లకు చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో ఏడుగురు ఢిల్లీ వాసులు, ముగ్గురు యుపికి చెందిన వారున్నట్లు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. చాలామంది భక్తులు స్లిప్‌లు లేకుండా ప్రవేశించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

కొంత మంది యువకుల మధ్య మొదలైన గొడవ తొక్కిసలాటకు దారి తీసినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటన త్రికూట కొండలపై ఉన్న గర్భగుడి వెలుపల మూడో నంబరు గేటు వద్ద జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. పరిస్థితిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు వివరించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును దేవస్థానం బోర్డే భరిస్తుందని ప్రకటించారు. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న మాతా వైష్ణోదేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించిన సిన్హా క్షతగాత్రులఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులను కోరారు.ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారం రోజుల్లో ప్రభుత్వనికి నివేదిక అందజేస్తుంది.

ప్రధాని మోడీ విచారం

ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధిపిఎం ఎన్‌ఆర్‌ఎఫ్ తరఫున రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 చొప్పున పరిహారం ప్రకటించారు. పరిస్థితిని ప్రధాని స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయంలోని అధికారి ఒకరు చెప్పారు.

అమిత్ షా దిగ్భ్రాంతి

ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ మాతావైష్ణోదేవి ఆలయంలో జరిగిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఘటనపై లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను వివరాలు అడిగి తెలుసుకున్నాను. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఆయన టీట్ చేశారు.

రాహుల్ సంతాపం

‘మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News