అదిలాబాద్‌లో షాపుల ముందు ఆందోళనలు
పత్తిసాగుపై విస్తీర్ణంపై భారీగా పెరిగిన అంచనాలు
ఈ ఏడాది 60.53లక్షల ఎకరాలకు చేరే అవకాశం
కోటి 20లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం
ఈనెలాఖరుకు అందుబాటులో విత్తనాలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెల్లబంగారం పంటసాగుకు ముందే తళుకులీనుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తిపంటకు గిరాకీ పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పండించిన పత్తి ఇతర ప్రాంతాలతో పొలిస్తే నాణ్యతా పరకంగా ఎంతో మెరుగైనదిగా ఉండటంతో తెలంగాణ పత్తికి మరింత అధిక ధరపెట్టి కొనేందుకు వ్యాపారలు పోటీలు పడుతుంటారు. కాటన్ కార్పోరేషన్ ద్వారా కొనుగోల్లతో అవసరం లేకుండానే మార్కెట్‌లో తెలంగాణ పత్తి పంట హాట్‌కేకుల్లా అమ్ముడుపోతోంది.వ్యవసాయ మార్కెట్ ఇంటలిజెన్స్ కేంద్రం నివేదకలో కూడా క్వింటాలు పత్తి రూ.7200పైగా చేరకునే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.ఈ నేపధ్యంలో ఈ సారి రాష్ట్ర రైతాంగం పత్తిసాగుపై మొగ్గు చూపుతోంది . ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సందడి మొదలైంది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముందస్తుగా వచ్చేస్తున్నాయన్న భారత వాతావరణ కేంద్రం అంచనాల నేపథ్యంలో ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటి 34 లక్షల ఎకరాల విస్తీర్ణం పైగా భూముల్లో వ్యవసాయ పంటలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ఈసారి అనూహ్యంగా 60.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం కోటి 20లక్షల ప్యాకెట్ల పత్తి విత్తానాలు రైతులకు అందుబాటులో ఉంచేందకు చర్యలు చేపట్టింది. గత ఏడాడి 50.59లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తిసాగును ప్రభుత్వం అంచనా వేసింది. విత్తనాల సీజన్ ముగిసే సరికి 44.77లక్షల ఎకరాల వద్దనే పత్తిసాగు విస్తీర్ణం ఆగిపోయింది. ఎంచుకున్న లక్షంలో 88.51శాతంలోనే పత్తిసాగు జరిగింది. పత్తి విత్తనాలు కూడా 90లక్షల ప్యాకెట్ల మేరకే విక్రయాలు జరిగాయి.
గత ఏడాదితోపోలిస్తే ఈ సారి ఏకంగా 16లక్షల ఎకరాల్లో పత్తిసాగు అదనంగా జరిగే అవకాశాలను అంచనా వేసి ఆమేరకు విత్తనాలు కూడా గత ఏడాదికంటే సుమారు 30లక్షల ప్యాకెట్లను అధికంగా అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో రైతులకు వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ అనుభవాలు పరిశీలిస్తే సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తే సగటున ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి రాగా అదే హైడెన్సిటీ కాటన్ సాగు చేస్తే 12 క్వింటాళ్ల దిగుబడి లభించినట్లు నిరూపితమైంది. ఈ విధానంలో కాస్త పెట్టుబడి ఎక్కువైనా దిగుబడులు అధికంగా లభిస్తాయని నిపుణులు తెలిపారు.
అధికసాంద్రతపై దృష్టి:
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌పై ప్రత్యేక దృష్టి సారించిన సర్కారు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. పెట్టుబడి అధికమైనా మంచి దిగుబడులు వస్తే రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న దృష్ట్యా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం విధానం పేరిట ప్రత్యేక ప్రాజెక్టు అమలు చేస్తోంది. ఏపీ, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసీఏఆర్ అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించింది. 2022, 2023లో తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేసి మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈ ఏడాది వానా కాలంలో తెలంగాణలో హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంపై ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు, రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో చీడపీడలు, తెగుళ్ల బెడద చాలా తక్కువగా ఉంటుందని నాణ్యమైన పత్తి దూది దిగుబడి లభిస్తుందని చెబుతున్నారు. మహారాష్ట్ర నాగపూర్ వార్ధాలోని ఐసీఏఆర్- సీఐసీఆర్ స్పెషల్ కాటన్ ప్రాజెక్టు కింద హయత్‌నగర్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎంపిక చేసింది. గాసిపియం అమెరికన్ పత్తి, ఆసియా పత్తి వంటి పలు రకాల పత్తి హైబ్రీడ్ వంగడాలను ఐసీసీఆర్ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల కిందట విడుదల చేసి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. కూలీల కొరత, రసం పీల్చే పురుగులైన తామర పురుగు, పచ్చ దోమ నుంచి అధిగమిండంతో పాటు ఆరోగ్యవంతమైన ఏకకాలంలో పత్తి పగిలే లక్షణం ఉండటం ప్రత్యేకతని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అదిలాబాద్‌లో విత్తనాలకోసం రైతుల ధర్నా!
పత్తి సాగుకు గడువు సమీపిస్తుండటంతో రైతులు విత్తనాల సేకరణ వేటలో పడ్డారు. దక్షిణ తెలంగాణ ప్రాతంతో పత్తిసాగుకు పేరుగాంచిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే రైతులు పత్తివిత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం అదిలాబాద్ కేంద్రంలో విత్తనాలవెంపర్లాటలో గందరగోళం నెలకొంది. ఒక రకం విత్తనాలకోసం రైతులంతా ఒక షాపు ముందు ఎగబడటంతో తోపులాట జరిగింది. పొలీసులు జోక్య చేసుకుని రైతును క్రమపద్దతిలో క్యూలైన్‌లో నిలబెట్టాల్సివచ్చింది. అయితే రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేశారన్న వార్తలను జిలా ఎస్పీ గౌష్ ఆలం తోసిపుచ్చారు.ఎటువంటి లాఠీ చార్జి జరగలేదని స్పష్టం చేశారు. రెండురోజులు గడవకముందే తిరిగి గురువారం నాడు అదే సీన్ రీపీట్ అయింది. అదిలాబాద్ పంజాబ్ .చౌక్ వద్ద పత్తివిత్తనాల పంపిణీలో ప్రభుత్వ నిరక్షతను నిరసిస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.
1.20లక్షలప్యాకెట్లు పంపిణీ:డిఏవో పుల్లయ్య!
అదిలాబాద్ జిల్లావరకు 1.20లక్షల ప్యాకెట్ల పత్తివిత్తనాలు పంపిణీ చేసినట్టు జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య వెల్లడించారు. జిల్లాలో 4.20లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం అన్ని కంపెనీల విత్తానాలు మొత్తం 10లక్షల ప్యాకెట్లు అవసరం ఉందని, 9లక్షల ప్యాకెట్టు ఇప్పటికే వచ్చాయని తెలిపారు. పత్తిలో 659 రకం విత్తనాలపట్ల రైతులు ఆసక్తి చూపటంతో వీటిని 50షాపుల్లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ రకం విత్తనాలు 40వేల ప్యాకెట్లు సరఫరా చేయించామన్నారు. మొత్తం 1.35లక్షల ప్యాకెట్లు అవసరం కాగా ఆ విత్తన కంపెనీ 70వేల ప్యాకెట్ల విత్తనాలు సరఫరా చేస్తోందని తెలిపారు. పత్తి విత్తనాలు నాటుకునేందుకు జూన్ రెండవ వారం వరకు సమయం ఉన్నందున రైతులు విత్తనాలకోసం ఆందోళన చెందవద్దని డిఏఓ పుల్లయ్య విజ్ణప్తి చేశారు.