న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు భక్తులతో కిక్కిరిసిపోయిన ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి 9.30 గంటలకు తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటనలో మృతి చెందిన వారిలో 14మంది మహిళలే కావడం గమనార్హం. రైల్వేస్టేషన్‌లోని 14, 15వ నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే రైల్వేశాఖ అధికారులు గాయపడిన వారికి ఎల్‌ఎన్‌జెపి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై రైల్వే అధికారులు దర్వాప్తు చేస్తున్నారు.
కాగా, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయిలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. మిగిత భక్తులను 4 ప్రత్వేక రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చారు రైల్వే అధికారులు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆపద్ధర్మ సీఎం ఆతిశీ ఎల్‌ఎన్‌జెపి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సహా సలువురు నేతలు సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.