Thursday, January 23, 2025

ఎవరు జవాబుదారీ?

- Advertisement -
- Advertisement -

పూరీలో ఆదివారం వైభవోపేతంగా జరిగిన జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట జరిగిందంటూ వెలువడిన ప్రాథమిక సమాచారాన్ని చూసినవారి గుండెలు గుబగుబలాడి ఉంటాయి. ఏటా అంగరంగ వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రలో లక్షలాది భక్తులు పాల్గొనడం రివాజు. ఈ సందర్భంగా తొక్కిసలాట అంటూ జరిగితే ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో ఊహించుకుంటేనే ప్రాణాలు ఠావులు తప్పుతాయి. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్ లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించి పట్టుమని పదిరోజులైనా కాకముందే అటువంటి సంఘటనే పూరీలో జరిగిందనేసరికి ఎవరికైనా ఆందోళన కలగడం సహజం.

అదృష్టవశాత్తూ రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో 60 ఏళ్ల వృద్ధుడు కన్నుమూయడం మినహా ఎక్కువ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుని ఉంటారు. అయితే ఎండ వేడిమి, విపరీతమైన రద్దీ కారణంగా శ్వాస ఆడక మూడు వందలమందికి పైగా భక్తులు ఆస్పత్రుల పాలు కావడం విస్మరించలేని విషయం. అత్యంత జనాభాతో, భిన్నమతాలతో అలరారే భారతదేశంలో ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలకు భక్తజనం భారీ సంఖ్యలో హాజరుకావడం, పలు సందర్భాల్లో తొక్కిసలాటలు జరిగి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారింది. కుంభమేళాలు, పుష్కరాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు బాబాలు, మత పెద్దలు నిర్వహించే కార్యక్రమాలలోనూ తోపులాటలు, తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. పదేళ్ల క్రితం ఒక అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన ఓ సర్వేలో ఇండియా లో 79% తొక్కిసలాటలు యాత్రాస్థలాలు, తీర్థయాత్రలు, మతపరమైన ఊరేగింపులు, సభలు, సమావేశాలలోనే జరుగుతున్నట్లు పేర్కొంది.

ముఖ్యంగా ఆలయాలు, నదీతీర ప్రాంతాలు తొక్కిసలాటలకు కేంద్ర బిందువులుగా ఉంటున్నట్లు సదరు సర్వే స్పష్టం చేసింది. సాధారణంగా భారీ సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు అకస్మాత్తుగా చెలరేగే వదంతులు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఎటుపోవాలో, ఏం చేయాలో దిక్కుతోచని జనం అక్కడి నుంచి బయటపడేందుకు ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో జరిగే ప్రాణనష్టం ఊహాతీతం. తొక్కిసలాటలంటూ జరిగితే ముందుగా బలయ్యేది పిల్లలు, మహిళలు, వృద్ధులే. మొన్నటి హథ్రస్ సంఘటనలో కూడా మృతులలో వందకు పైగా మహిళలు, పిల్లలే కావడం గమనార్హం. జనాన్ని అదుపు చేసేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని పక్షంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారిని అదుపు చేయడం మానవమాత్రులకు సాధ్యంకాదు. హథ్రస్ సంఘటననే ఉదాహరణగా తీసుకుంటే 80 వేల మందికి మాత్రమే అనుమతి ఉన్న సంఘటన స్థలంలో రెండున్నర లక్షలమంది రావడం తొక్కిసలాటకు ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు. అయితే 80 వేల మంది వచ్చినా వారి భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారన్నదే ప్రశ్న. భారీ యెత్తున జనాలు హాజరయ్యే చోట్ల తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్ల గురించి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ 2014లో నియమ నిబంధనలను రూపొందించినా వాటిని అమలు చేయడంలో పోలీసులు దారుణంగా విఫలమవుతున్నారనడానికి గత పదేళ్లలో జరిగిన ఎన్నో తొక్కిసలాటలను ఉదాహరణగా చెప్పవచ్చు.

గత ఏడాది ఇండోర్‌లో శ్రీరామనవమి ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో 36 మంది కన్నుమూశారు. ఇలాంటి తొక్కిసలాట సంఘటనల్లో 2008లో రాజస్థాన్‌లో జరిగిన ఉదంతం ఘోరమైనది. జోధ్‌పూర్ లోని చాముండదేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి 250 మంది బలికావడం మరచిపోలేని దుర్ఘటన. భారీయెత్తున జరిగే ఆధ్యాత్మిక సభలకు యథాలాపంగా, కళ్లుమూసుకుని అనుమతులు ఇచ్చే పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే సంగతిని మరచిపోతున్నారు. వేలు, లక్షల్లో జనం హాజరయ్యే చోట్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఉన్నాయో లేదో చూడటం పోలీసుల ప్రథమ కర్తవ్యం. అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే, ప్రమాదం నుంచి జనం తప్పించుకోవడానికి అత్యవసర ద్వారాలనూ ఏర్పాటు చేయాలి. వాటితోపాటే తాగునీరు, ప్రాథమిక చికిత్స సదుపాయాలు సైతం కల్పించగలగాలి. అంబులెన్సులను సిద్ధంగా ఉంచడమూ తప్పనిసరి. అయితే ఇలాంటి కనీస భద్రతా ఏర్పాట్ల గురించి పట్టించుకోని అధికార యంత్రాంగం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి, మృతులను పోస్టుమార్టానికి పంపించి చేతులు దులుపుకోవడం గర్హనీయం. తొక్కిసలాటలు జరిగినప్పుడు సదరు అధికార యంత్రాంగాన్ని, పోలీసులను కూడా బాధ్యులుగా చేసినప్పుడే ఇలాంటి సంఘటనలకు కళ్లెం పడేది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News