రూ.2వేల నోటు రద్దు తర్వాత తీవ్ర ప్రభావం
రెండు మాసాలుగా తగ్గిన ఆమ్దానీ
రూ.500 నోట్లతో లావాదేవీలు ఇబ్బందిగా మారాయంటున్న రియల్టర్లు, వ్యాపారవేత్తలు
అగ్రిమెంట్ల మీదనే కొనసాగుతున్న క్రయవిక్రయాలు
హైదరాబాద్: రెండు వేల నోటు రద్దు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖపై పడింది. గతనెలలో ఈ నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బిఐ పేర్కొనడంతో రియల్టర్‌లు క్రయ, విక్రయాలను తగ్గించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (రెండు నెలలుగా-) స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గతంకన్నా తగ్గింది. దీనికి ముఖ్య కారణం రెండు వేల నోట్ల రద్దుతో పాటు జిఓ 111 ఎత్తివేత, ఎల్‌ఆర్‌ఎస్‌పై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడం, అనుమతి లేని లే ఔట్లలో రిజిస్ట్రేషన్‌లు జరగపోవడంతో ఆదాయం తగ్గిపోయిందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు త్వరలో సాధారణ ఎన్నికలు రానుండడం, భూముల క్రయ, విక్రయాల పడిందని రియల్‌రంగం నిపుణులు పేర్కొంటున్నారు.
వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖలు ముందంజలో…
రాష్ట్ర ఆదాయంలో ముఖ్య పాత్రను పోషించేవి వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలే. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావడంతో ఆదాయంలో వాణిజ్య పన్నుల శాఖ మొదటిస్థానం, ఎక్సైజ్ శాఖ రెండో స్థానంలో నిలవగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మూడోస్థానంలో నిలిచింది. అయితే వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖలు ఈ రెండు నెలల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ముమ్మర ప్రయత్నం చేస్తుండగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం మాత్రం తగ్గిందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
చాలా వరకు అగ్రిమెంట్ల మీదనే….
ప్రస్తుతం రెండు వేల నోటు రద్దుతో పాటు ఈ సంవత్సరం పెరిగిన భూముల ధరలు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాల నేపథ్యంలో ఆదాయం తగ్గిందని ఆ శాఖ పేర్కొంటుంది. మార్కెట్ ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడంతో ఆశించిన మేర ఆదాయం రావడం లేదు. స్థిరాస్తుల క్రయ, విక్రయాల్లో వేగం పుంజుకున్నా చాలా వరకు అగ్రిమెంట్ల మీదనే కొనసాగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. భూములు, ప్లాట్లు, ఖాళీ స్థలాల మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేన్ల శాఖలో అటు రిజిస్ట్రేషన్లు, ఇటు రాబడులు తగ్గాయి.
తగ్గిన రిజిస్ట్రేషన్‌ల సంఖ్య
రాష్ట్రంలో గత ఆర్థిక ఏడాది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరిగినప్పటికీ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది. గతేడాది 19.44లక్షలు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా, రూ.14,291 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఈ ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్‌లతో పాటు రాబడి స్వల్పంగా పడిపోయిందని ఆశాఖ గణాంకాలను చూస్తే తెలుస్తుంది. ఈ శాఖకు గడిచిన నాలుగేళ్లలో ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. అయితే రెండు నెలలుగా ఆదాయం తగ్గడంపై ఆ శాఖ అధికారులు పునరాలోచనలో పడ్డారు. 2019,-20 ఆర్థిక ఏడాదిలో 16.59 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.7,061 కోట్లు ఆదాయం వచ్చింది. 2020,-21లో కొవిడ్ ప్రభావంతో భారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయింది. కేవలం 12.10 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగడంతో రూ.5,260.20 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. 2021,-22 ఆర్థిక సంవత్సరంలో 19.72 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా తద్వారా ప్రభుత్వానికి రూ.12,370.59 కోట్ల ఆదాయం సమకూరింది. 2022-, 23 ఆర్థిక ఏడాదిలో 19.44 లక్షలు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.14,291 కోట్లు మేర ఆదాయం ప్రభుత్వ ఖజనాకు చేరింది.
రెండు నెలల్లో రూ.2వేల పైచిలుకు…
2023,-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రెండు నెలల్లో అటు రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గగా ఇటు రాబడి కూడా పడిపోయింది. ఏప్రిల్ నెలలో 1.54 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా తద్వారా రూ.1,087.46 కోట్లు ఆదాయం రాగా, మే నెలల్లో 1.73లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లకు గాను రూ.1317.19 కోట్లు మేర ఆదాయం వచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల కోట్ల పైచిలుకు…
గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ రూ.72,564 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల కోట్ల పైచిలుకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆ శాఖ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అందులో భాగంగా 200 టీంలు, 170 మంది అధికారులతో నిరంతరం లక్ష్యాన్ని సాధించుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు.
ఈ రెండు నెలల్లో భారీ అమ్మకాలు
ఎక్పైజ్ శాఖ గత ఆర్థిక సంవత్సరం (2022, 23)లో రూ.35,145.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, 3.52 కోట్ల లిక్కర్ కేసులు, 4.79 కోట్ల బీర్ల కేసులను విక్రయించింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల పైచిలుకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న లక్షంతో ముందుకు వెళుతోంది. ఏప్రిల్, మే నెలలో బీర్ల ద్వారా ఎక్సైజ్ శాఖ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకొని అదే ఉత్సాహాంతో ముందుకెళుతోంది. రానున్న రోజుల్లో ఎక్సైజ్ శాఖ అంచనాలను అందుకుంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.