Friday, November 22, 2024

స్టాన్ స్వామి దళితుల ‘దైవం’

- Advertisement -
- Advertisement -

Stan Swamy is the 'God' of the Dalits

 

రోమన్ క్యాథలిక్‌లో జీసస్ సమాజ సభ్యులను జెసూట్స్ అంటారు. 1534లో సెయింట్ ఇగ్నేషియస్ లయోలా, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈ సమాజాన్ని స్థాపించారు. సంస్కరణలకు వ్యతిరేకంగా మత హింసలు చెలరేగినప్పటికీ రోమన్ క్యాథలిక్ తాత్వికత, చైతన్యం మీద ఈ సమాజం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. మతాచార్యులు, ప్రచారకులు ఇందులో సభ్యు లే. కాని వారు పూజార్లు కారు. మత ఛాందసాలను ప్రచారంచేయరు. మతమార్పిళ్ళు చేయరు. నీ కోసం ప్రార్థిస్తాను వంటి మత ఉదారవాద మాటలు చెప్పరు. ప్రత్యేక, ప్రత్యక్ష కార్యాచరణ వీరి లక్ష్యం. స్టానిస్లాస్ లూర్డు స్వామి (స్టాన్ స్వామి) జెసూట్ ఫాదర్. ఆచరణ భౌతికవాద, మానవత్వ, ప్రజాప్రయోజన ప్రయోగాత్మక మత శ్రేష్టుడు. పోప్ ఫ్రాన్సిస్ కూడా ఒకప్పటి జెసూట్.
బ్రిటిష్ పక్షపాత పీష్వాలపై దళిత సైన్యం సాధించిన విజయ శత వార్షికోత్సవ నిర్వహణకు కోరేగావ్‌లో ఎల్గార్ పరిషద్ ఏర్పాటు సభ 2017 డిసెంబర్ 31న జరిగింది.

అందులో పాల్గొన్న ప్రముఖులను నిర్బంధించారు. ప్రధాని హత్యకు పథకం పన్నారని అభాండం. మరాఠీ రాని రోనా విల్సన్ ప్రకాశ్ అనే వ్యక్తికి రాశాడన్న మరాఠీ ఉత్తరం దీనికి ఆధారం. దీన్ని ఒక మాల్వేర్ ద్వారా వరవరరావు కంప్యూటర్ లోకి ఎక్కించి తర్వాత రోనా విల్సన్ కంప్యూటర్ లో చొప్పించారని ఒక అమెరికన్ దర్యాప్తు సంస్థ ధ్రువీకరించింది. ఈ నేరం కిందనే స్టాన్ స్వామిని అక్టోబర్ 2020లో అరెస్టు చేసి ముంబయి తలోజ కేంద్ర కారాగారంలో ఉంచారు. జైల్లో స్ట్రా, గ్లాసు లాంటి అత్యవసరాలు అడిగినా కోర్టు ఇప్పించలేదు. నాలుగు సార్లు బెయిల్ తిరస్కరించారు. జైల్లో కరోన సోకింది. బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్న జులై 5 న స్టాన్ స్వామి ఆస్పత్రిలో కన్నుమూశారు.

ప్రధానిని చంపగల శక్తియుక్తులు, ఆయుధాలు, వయసు వీరివద్ద లేవు. వీరి తాత్వికత ప్రజలను చైతన్య పరుస్తోందని మోడీ భయం. భావవాద తాత్వికత మనుషులను మానవులుగా ఎదగనివ్వదు. ఆదిమ సమాజ పశుప్రవృత్తిని ప్రేరేపిస్తుంది. హింస, హత్యలకు దారి తీస్తుంది. నేటి పాలక వర్గానిది ఈ భావజాలం. భౌతికవాద తాత్వికత అణగదొక్కబడ్డ కులాల ప్రజల కోసం, సమాజ శ్రేయస్సుకు, దేశ ప్రగతికి పనిచేస్తుంది. జాతి మత కుల లింగ ప్రాంత వివక్షతల నిర్మూలనకు, స్వేచ్ఛా సమానత్వాలకు శ్రమిస్తుంది. అరిస్టాటిల్ సాంఘిక జంతువును మనిషిగా, మానవునిగా తీర్చిదిద్దుతుంది. నేటి ప్రభుత్వం జైళ్ళలో కుక్కిన మేధావులది ఈ భావజాలమే. ఈ తాత్వికత అమలుకు జీవితాలను ధారపోసిన స్టాన్ స్వామి లాంటివారు ప్రజలను ప్రభావితం చేస్తారని పాలకుల భయం. ఈ మహానుభావులు చేస్తున్నది పాలకులు చేయవలసిన పని. వీరిని సన్మానించాలి. బాధ్యత మరిచిన పాలకులను అప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధ చర్యల నేరం మీద జైళ్ళలో పెట్టాలి. ఇప్పుడు తద్విరుద్ధం జరుగుతోంది.

స్టాన్ స్వామి తనకు, తన సహ ఉద్యమకారులకు ‘కామ్రేడ్స్’ అన్న పదం వాడేవారు. మానవుల కోసం ప్రత్యేకించి వంచితుల కోసం మానవత్వంతో పని చేసేవారందరూ కామ్రేడ్సే అనేవారు. స్వామి తమిళనాడు తిరుచిరాపల్లిలో రైతు కుటుంబంలో జన్మించారు. జార్ఖండ్ రాజధాని రాంచి శివార్లలో 2006 లో స్వామి స్థాపించిన బగైచ (సకల జాతి వృక్షాల సమ్మేళన వనం) సంస్థ, స్వామి ఆయన కార్యకర్తల కార్యక్షేత్రం. దళిత, ఆదివాసీ సంస్థలు ఇక్కడ సమావేశమయ్యేవి. ఆ సంస్థలకు స్వామి రాజ్యాంగ హక్కులు బోధించేవారు. గ్రామీణులకు వ్యవసాయ శిక్షణ ఇచ్చేవారు. దళిత గిరిజన హక్కుల కోసం పోరాడిన మానవవాది స్టాన్ స్వామి. పరిశ్రమలు, ప్రాజెక్టుల మిషతో ఆదివాసుల భూముల ఆక్రమణను ఎదిరించారు.గ్రామాలు తిరిగి ఆదివాసులను చైతన్యపరిచారు. ఆదివాసులపై జార్ఖండ్‌లో జరుగుతున్న ఘోర క్రూర దారుణాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రధాన స్రవంతి దృష్టికి తెచ్చారు. వారి భూహక్కులు, బతుకు దెరువులపై కార్పొరేట్ల రూపంలో రాజ్యం దాడి చేసింది.

ఇది మోడీ అభివృద్ధి నమూనా. స్వామి కార్పొరేట్ల దురాశల మీద, ఆదివాసీ ప్రతిష్ఠను వనవాసిగా దిగజార్చిన సంఘ్ భావజాలంపై యుద్ధం చేశారు. ఆదివాసులు ఈ దేశ మూలవాసులు. ఆదివాసీ పదం నేటి పాలకవర్గ చపలచిత్త ఆర్య భావాన్ని చిత్తు చేస్తుంది. దాడులు,- మతమార్పిళ్ల సంఘ్ భావజాల పంజా ఆర్య, వనవాసి పదజాలాల కుట్ర. జార్ఖండ్‌లో ఆదివాసులపై రాజ్య దురాక్రమణ, అన్యాయాలను అడ్డుకున్నారు స్వామి. నేర విచారణ, రుజువు, శిక్షలు లేకుండా ఏళ్ళ తరబడి కంపు జైళ్ళలో మగ్గుతున్న లక్షలాది ఆదివాసులను న్యాయస్థానాలలో పోరాడి విడిపించారు. చివరికి అదే స్థితిలో ఆయన తుది శ్వాస వదలడం శోచనీయం.

అనుసూచిత తెగల సేవకుల రక్షణకు ఆ తెగకే చెందిన రాష్ట్రపతి కూడా ముందుకు రాలేదు. పాలకుల కుల మతాలు ఏవయినా వారిది పాలకవర్గ దోపిడీ భావజాలమని నేటి రాష్ట్రపతి, ప్రధాని మరోసారి నిరూపించారు. ఆధునిక యాంత్రిక పారిశ్రామిక పెట్టుబడిదారీ సమాజంలో భావజాలం, ఆర్థికస్థితి ప్రధాన పాత్ర పోషిస్తాయి. నేటి రాజ్యాలు ఆర్థిక రారాజులైన కార్పొరేట్ల చేతుల్లో బందీలు. నేటి పాలకులు, అధిక సంఖ్యాకుల మతం, కార్పొరేట్లు కలిసి దోపిడీ రాజ్యపాలన కొనసాగిస్తున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద, భారత శిక్షా స్మృతి 1860 సెక్షన్ 124 ఎ – రాజద్రోహ నేరం మోపి సమాజ నిర్మాతలను అరెస్టు చేస్తున్నారు. ఏళ్ళ తరబడి నేరనిరూపణ విచారణ జరగవు.

బెయిల్ ఇవ్వరు. బెయిల్ విచారణలో ఇటీవల ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టు కొంత మెరుగ్గా ప్రవర్తించాయి. అధికార అంగ ఆర్థిక బలాలతో సామాజిక ఆర్థిక రాజకీయ బలహీనున్ని హింసించిన వ్యక్తిని న్యాయమూర్తి నీవు అతన్ని బంధించటమే తప్పు అనాలి. శిక్షించాలి. కొడితే కొట్టావు కర్రతో ఎందుకు కొట్టావు? కాలో చెయ్యో విరగకొట్టాలి కాని చంపరాదు. అన్నట్లుంది కోర్టుల తీరు. 2018లో స్వలింగ సంపర్క సంబంధాల కేసు విచారణలో సుప్రీంకోర్టు భారత శిక్షా స్మృతి సెక్షన్ 377 ను రద్దు చేసింది. స్వలింగ సంపర్కుల అనుకూలంగా తీర్పు చెప్పింది. రాజ్యాంగ విరుద్ధ చట్టాలను, శిక్షా స్మృతి సెక్షన్లను రద్దు చేసే, వాటిని సవరించమని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టులకుంది. కోర్టులు తమ పరిధి హక్కులను వాడాలి. పాలక వర్గ పక్షపాతంతో వ్యవహరించరాదు.

స్టాన్ స్వామి మరణం రాజద్రోహం. రాజ్యం అధీనంలో కన్నుమూస్తారా? ఎంత ధైర్యం! ఎంత కుట్ర! అని ప్రభుత్వ పెద్దలు, వారి భక్తులు ఆరోపించవచ్చు. ఇంతకూ దోషులెవరు? స్వామియా? నిరాసక్త ప్రజలా? రాజ్య విధానాలా? రాజ్యం, పోలీసులు, జైలర్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు స్వామి చావులో భాగస్వాములే. బాధ్యత గలవారే. పేదల చెదిరిన ఆశలు, చితికిన బతుకులు వీరి చర్యల, వాటి పరిణామాల పర్యవసనాలే. పాలకులు తొక్కాలనుకున్న వారిని రక్షించడం, దళితుల, ఆదివాసుల భూములు లాక్కొంటున్న పాలక మిత్రవర్గ కార్పొరేట్లను అడ్డుకోడం, మూలవాసులను చైతన్యపరచటం, వారి హక్కులను కాపాడటం స్టాన్ స్వామి చేసిన క్షమించరాని నేరాలు. అందుకే ఆయనకు బెయిలు లేని జైలు. అప్రకటిత మరణ శిక్ష.

స్టాన్ స్వామి ఏసులో, పేదల్లో తనను ప్రతిష్టించుకున్నారు. బడుగుల్లో దేవుని చూశారు. ఆదివాసుల సేవలో నిబద్ధతతో పని చేయడం, వారి న్యాయ సాధనకు అంకితం కావడం, అర్బన్ నక్సల్స్, మావోయిస్టుల ముద్రతో జైళ్ళలో మగ్గుతున్న వేల మంది ఆదివాసులను విడిపించడం స్టాన్ స్వామికి అర్పించగల నిజమైన నివాళి. స్వామి వారసత్వాన్ని కొనసాగించ గల అవకాశాలను అందుకోడం, పేదల, దళితుల, గిరిజనుల, ఆదివాసుల హక్కుల కోసం పని చేయడం, పోరాడటం జెసూట్లతో సహా ప్రగతి శీలుర ప్రాధాన్యత కావాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News