84 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వాన్ని కూలదోస్తాడా?: సంజయ్ రౌత్
ముంబయి: ఎల్గర్ పరిషత్‌మావోయిస్టు లింక్ కేసులో నిందితుడు ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో మృతి చెందడం ఏ విధంగాను సమర్థనీయం కాదని, ఒక వేళ మావోయిసుట్లు కశ్మీర్ వేర్పాటు వాదులకన్నా ప్రమాదకరమైనప్పటికీ దీన్ని సమర్థించుకోలేమని శివసేన ఎంపి సంజయ్ రౌత్ అన్నారు. 84 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వంపై యుద్ధం చేస్తే కూలిపోయేంతగా భారత దేశం పునాదులు బలహీనంగా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే దేశానికి వ్యతిరేకం అని అర్థం కాదని పార్టీ పత్రిక ‘సామ్నా’లో ప్రతివారం రాసే తన కాలం రోక్‌తోక్‌లో రాసిన వ్యాసంలో రౌత్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం ఆరోపణలతో అరెస్టయిన 84 ఏళ్ల స్వామి ఆరోగ్య కారణాలపై బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తుండగానే ఇటీవల ముంబయిలోని ఓ ఆస్పత్రిలో కన్ను మూసిన విషయం తెలిసిందే.
‘శారీరకంగా అశక్తుడైన 84 ఏళ్ల వృద్ధుడిని చూసి భయపడే ప్రభుత్వం స్వరూపం రీత్యా నియంతృత్వమైనదైనప్పటికీ మానసికంగా బలహీనమైనది’ అని సామ్నా పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూడా అయిన రౌత్ అన్నారు. ఎల్గర్ పరిషత్ కార్యకలాపాలు సమర్థించలేనివే కావచ్చు కానీఆ తర్వాత జరిగిన ఘటనలన్నీ కూడా ‘భావప్రకటనా స్వేచ్ఛను హరించే కుట్ర’అనే చెప్పవచ్చని ఈ కేసులో వరవర రావు, సుధా భరద్వాజ్. నావల్ఖాలాంటి రచయితలను అరెస్టు చేయడాన్ని ప్రస్తావిస్తూ రౌత్ అన్నారు. అరెస్టయిన వారంతా కూడా మేధావులు, రచయితలని, తమ ఆలోచనలను రచనల ద్వారా వినిపించే ఒక సిద్ధాంతానికి చెందిన వారని ఆయన అన్నారు. ‘ఈ చర్య ద్వారా వారు ప్రభుత్వాన్ని కూలదోయగలరా?’ అని ఆయన ప్రశ్నించారు.