గ్యారంటీల పేరుతో గారడీ మాటలను నమ్మొద్దు
ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అభివృద్దికి అండగా నిలవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వనపర్తి వాసులతో కర్మన్‌ఘాట్‌లోని అనంతరెడ్డి గార్డెన్‌లో ఆదివారం మంత్రి నిరంజన్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలో వనపర్తి వందేళ్ల భవిష్యత్ నిర్మించామన్నారు. తాగునీటికి, సాగునీటికి లోటు లేకుండా తీర్చిదిద్దామని, లక్ష పై చిలుకు ఎకరాలకు సాగునీరు తీసుకువచ్చామని చెప్పారు. మరో 25 వేల ఎకరాలకు సాగునీరు రాబోతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కానుందని మంత్రి చెప్పారు. వనపర్తిలో మెడికల్ , ఇంజనీరింగ్, ఫిషరీస్, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో విద్యారంగాన్ని బలోపేతం చేశామన్నారు. నూతనంగా నిర్మించబోయే ఐటి టవర్ వనపర్తికి మరో ఐకాన్ గా నిలవనున్నదన్నారు. సాగునీటి రాకతో వలసలు ఆగిపోయాయని, ఇతర రాష్ట్రాల నుండి పాలమూరుకు ఉపాధి కోసం వలసలు వస్తున్నారని మంత్రి తెలిపారు.
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్దిని గమనించాలన్నారు. విద్య, వైద్యం, కరెంటు, వ్యవసాయం, ఉపాధి రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, కెసిఆర్ నాయకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయన్నారు. రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలి విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మేళనానికి భారీ ఎత్తున ఓటర్లు హాజరయ్యారు.