Sunday, January 19, 2025

ఇ-బైక్ బ్యాటరీలకు ప్రమాణాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించే వాహనదారుల సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. వరుసగా ఈ వెహికల్స్ (ఎలక్ట్రిక్ బైక్‌లు) పేలిపోతుండడంతో వాహనదారులు భయాందోళనలు చెందుతున్నారు. ప్రస్తుతం ఈ బైక్‌ల సేఫ్టీ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వరుసగా ఎలక్ట్రిక్ బైక్‌లు చార్జీంగ్ పెట్టిన సమయంలో పేలిపోతున్న ఘటనలు 2022 సంవత్సరంలో అధికంగా చోటు చేసుకోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుఅప్రమత్తమయ్యాయి. మార్చి 2022లో తమిళనాడులోని వేలూరులో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలడంతో వాహనదారుడు అతని కూతురు మృతి చెందగా, అనంతరం వరుసగా ఎపి, తెలంగాణలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.

భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. లీటర్ పెట్రోల్ రూ. 110లు ఉండటంతో పెట్రోల్ బైక్‌లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ బైక్‌లను కొనడానికి వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వీటి కొనుగోళ్లు కూడా ఈ సంవత్సరం భారీగా పెరిగాయి. అయి తే ఎలక్ట్రికల్ బైక్‌లు వరుసగా పేలుతుండటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ప్రతినెలా 3 నుంచి 5 వేల బైక్‌లు రాష్ట్రవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయని అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి.

వరుస సంఘటనలు..

ఎపిలోని విజయవాడ, తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, సిద్ధిపేట, హైదరాబాద్ జిల్లాలతో పాటు మంగళవారం సికింద్రాబాద్‌లో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గతంలో బ్యాటరీ పేలిన ఘటనలో చాలామంది గాయపడగా, పలువురు దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మార్గదర్శకాలను రూపొందించే పనిలో కేంద్ర అధికారులు నిమగ్నమయ్యారు. అసలు కారణాలను తెలుసుకోవడానికి వారు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలతో చర్చలు చేపట్టినట్టుగా తెలిసింది. పేలుడుకు సంబంధించిన కారణాలను తెలుసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని సైతం నియమించింది.

ఈ కమిటీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఎలక్ట్రిక్ బైక్‌ల్లో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాల్లో బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ లోపభూయిష్టంగా ఉండటమే కారణమని ప్రాథమికంగా తేల్చింది. అయితే మరింత విచారణ అనంతరం ఈ పేలుళ్లకు సంబంధించిన తుది నివేదికను కేంద్రం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆదేశాలతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బిఐఎస్) విద్యుత్ వాహనాల బ్యాటరీలకు సంబంధించి ఒక ముసాయిదాను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తే బ్యాటరీ వాహనాల సంస్థలు ఆ మేరకు ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.

రెడ్ కో వద్ద 18 సంస్థల వివరాలు మాత్రమే నమోదు…

అయితే విద్యుత్ వాహనాలు తయారు చేసే సంస్థలు నాణ్యమైన బ్యాటరీలు ఉపయోగిస్తున్నాయా? లేవా? అన్న దాని గురించి తెలుసుకోవడానికి కేంద్రం విద్యుత్ వాహనాలు తయారు చేసే కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది. అయితే విద్యుత్ వాహనాలు తయారు చేసే కంపెనీలు నాసిరకం లిథియం ఆయాన్ బ్యాటరీల వాడకం, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (బిఎంఎస్) సక్రమంగా పనిచేయకపోతే అధిక ఛార్జింగ్‌తో పేలుళ్లకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంన్నారు. విద్యుత్ వాహనాలు తయారు చేసే సంస్థలు నాణ్యమైన బ్యాటరీలు ఉపయోగిస్తున్నాయా? లేవా? అని తనిఖీ చేసే వ్యవస్థ ప్రస్తుతానికి లేదు. రాష్ట్రంలో 40 వరకు బ్యాటరీతో నడిచే ద్విచక్రవాహనాలను విక్రయిస్తున్న సంస్థలు ఉంటే వీటిలో ఇప్పటి వరకు 18 సంస్థలు మాత్రమే ఛార్జింగ్ స్టేషన్లకు నోడల్ ఏజెన్సీగా వ్యవహారిస్తున్న టిఎస్ రెడ్‌కో వద్ద నమోదు చేసుకున్నాయి. అయితే ఈ వాహనాలను విక్రయించే సంస్థలు, వారు వాడుతున్న బ్యాటరీల గురించి టిఎస్ రెడ్‌కో ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది.

లిథియం అయాన్‌తో బ్యాటరీలు…

విద్యుత్ వాహనాల్లో బ్యాటరీనే కీలకం. ఎక్కువగా లిథియం అయాన్‌తో రూపొందించే బ్యాటరీలను వాహనాల్లో ఉపయోగిస్తున్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీలో ఎక్కువగా చిన్న సంస్థలు ఉన్నాయి. తక్కువ ఖరీదుకే వాహనాలను అందించాలన్న ఉద్ధేశంతో తక్కువ ధరలో వచ్చే బ్యాటరీ ప్యాక్‌లు వినియోగిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News