ఇయు పార్లమెంట్ స్టాండింగ్ ఒవేషన్
స్ట్రాస్‌బర్గ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అరుదైన గౌరవం లభించింది. మంగళవారం యూరోపియన్ పార్లమెంటునుద్దేశించి ఆయన ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆన్‌లైన్‌ద్వారా ప్రసంగించిన అనంతరం ఇయు పార్లమెంటు సభ్యులంతా లేచి నిలబడి(స్టాండింగ్ ఒవేషన్) చప్పట్లు కొట్టారు. జెలెన్‌స్కీ మాట్లాడుతూ తాము మాతృభూమి కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామన్నారు. తాము ఉక్రెయినీలమని, శక్తిమంతులమని, తమనెవ్వరూ విడదీయలేరని చెప్పారు. ఆ వెంటనే సభ్యులంతా లేచి నిలబడి ఆయనను అభినందిస్తూ కరతాళ ధ్వనులు చేశారు. రష్యా దాడిని ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌కు అండగా ఉన్నామని నిరూపించుకోవాలని జెలెన్‌స్కీ యూరోపియన్ పార్లమెంటును కోరారు. ‘ మీరు లేకుండానే ఉక్రెయిన్ ఒంటరిగా పోరాడుతోంది. మేము మా బలాన్ని నిరూపించుకున్నాం. కనీసం మేమూ మీలాంటి వాళ్లమని నిరూపించుకున్నాం. మాకు అండగా ఉన్నామని, మమ్మల్ని వదిలిపెట్టమని మీరు కూడా నిరూపించుకోవాలి’ అని జెలెన్‌స్కీ అన్నారు.