తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
చెన్నై : ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తమిళనాడు లోని ట్యుటికోరిన్ లోని వేదాంత స్టెరిలైట్ ప్లాంట్‌ను తాత్కాలికంగా నాలుగు నెలల పాటు పనిచేయించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైద్య చికిత్సలో దేశం మొత్తం మీద ఆక్సిజన్ కొరత ఎదురుకావడంతో అన్ని రాష్ట్రాలు ఈమేరకు ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు యోచిస్తున్నాయి. ఈనేపధ్యంలో ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్టెరిలైట్ ప్లాంట్‌ను తెరిపించడానికి నిర్ణయం తీసుకున్నారు.
వాతావరణ కాలుష్య సమస్యపై ఆందోళనలు చెలరేగడంతో ఆ ప్లాంట్‌ను 2018 నుంచి మూసి వేశారు. అప్పటి నుంచి కాపర్ ప్రొడక్షన్ కానీ ఇతర కార్యకలాపాలు కానీ మళ్లీ ప్రారంభం కాలేదు రాష్ట్రంలో ఒకరోజు ఆక్సిజన్ వినియోగం 350 ఎంటిలకు చేరింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో రోజుకు 400 ఎంటిలకు ఆక్సిజన్ ఉత్పత్తి చేయక తప్పదని సమావేశంలో చర్చించారు. పరిశ్రమల ఆక్సిజన్ వైద్య అవసరాలకు మళ్లించాలంటే ఆమేరకు యంత్రాలను మార్చవలసి వస్తుందని, దీనికి కనీసం మూడు నెలలైనా పడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.