Thursday, January 23, 2025

నేటి నుంచి తరలింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నూతన సచివాలయ భవనాన్ని ఈనెల 30వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించనుండగా అందులోకి నేటి నుంచి ఫైళ్ల తరలింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశా లు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సచివాలయంలోని మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. వారికి అనుబంధంగా ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, విభాగాలకు ఛాంబర్లు, గదులు, వర్క్ స్టేషన్లు ఉంటా యి. శాఖలవారీగా కొత్త సచివాలయ భవనంలోకి నేటి నుంచి తరలింపు ప్రక్రియ చేపట్టాలన్న ప్ర భుత్వ సిఎస్ ఒక్కో శాఖకు ఒక్కో సమయాన్ని కేటాయించారు. ఈనెల 28వ తేదీ నాటికి తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని సిఎస్ శాంతకుమారి అన్ని శాఖల కార్యదర్శలను ఆదేశించారు. ఈనెల 30వ తేదీన సచివాలయం ప్రారంభించే నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించే విధంగా సిద్ధం కావాలని సిఎస్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయింపు
ఈనెల 26వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు షిఫ్టింగ్ కొనసాగనుంది. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయింపు జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్‌లో హోం శాఖ, పంచాయతీరాజ్, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్‌లో వ్యవసాయ శాఖ, ఎస్సీ డెవలప్‌మెంట్‌కు కేటాయించారు. ఇక నాలుగో అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా డిపార్ట్‌మెంట్, ఐదో అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ (జిఏడి), ఆర్ అండ్ బి, ఆరో ఫ్లోర్‌లో సిఎం, సిఎస్‌లకు కేటాయించారు. లోవర్ గ్రౌండ్ ప్లోర్‌లో స్టోర్స్, రికార్డు రూమ్‌లతో పాటు వివిధ సేవలకు సంబంధించిన ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శాఖల వారీగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్య వారి సీట్లలో….
ఈనెల 30వ తేదీన ఉదయం 6 గంటలకు సచివాలయ ప్రాంగణంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సుదర్శన యాగం నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల్లోగా పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. మధ్యాహ్నం పూర్ణాహుతి సమయానికి సిఎం కెసిఆర్ సచివాలయానికి వస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల నుంచి ఒంటి గంట 33 నిమిషాల మధ్య సింహలగ్న ముహూర్తంలో కెసిఆర్ తన సీట్లో ఆసీనులవుతారు. తరవాత సమీకృత కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ ఉంటుంది. తర్వాత మంత్రులు, అధికారులు తమ సీట్లలో కూర్చుంటారు. మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్య కార్యదర్శులు, అధికారులు వారి వారి సీట్లలో కూర్చొని ఏదో ఒక దస్త్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే అందరికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.

తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశం
ఆర్ అండ్ బి, ఐటి, పోలీసు, ఐ అండ్ పిఆర్, పురపాలక, వైద్య ఆరోగ్య, జల మండలి, అగ్నిమాపక, విద్యుత్, విజయ డెయిరీ, ప్రొటోకాల్, సాధారణ పరిపాలన శాఖ, హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు. సచివాలయం ఎదుట హామం నిర్వహించడానికి మండపం తయారు చేస్తున్నారు. వీటి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

కొత్త సచివాలయ భద్రత టిఎస్‌ఎస్పీకి
కొత్త సచివాలయ భద్రతను తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్‌లకు (టిఎస్‌ఎస్పీ) అప్పగించారు. ఈ నెల 30వ తేదీన నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం నుంచి ఈ సచివాలయ భద్రతను చేపట్టాలని టిఎస్‌ఎస్పీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఎస్పీఎఫ్ నుంచి భద్రతను చేపట్టాలని టీఎస్‌ఎస్పీ బెటాలియన్స్ అదనపు డిజిపికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు సచివాలయ భద్రతను ఎస్పీఎఫ్ పర్యవేక్షిస్తుండగా ఇకనుంచి ఆ బాధ్యతలను తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ చేపట్టనుంది. ఇక సచివాలయం సిఎస్‌ఓగా పి.వెంకట్రాములు వ్యవహారించనున్నారు. ప్రస్తుతం ఆయన టిఎస్‌ఎస్పీ అదనపు కమాండెంట్‌గా సేవలందిస్తున్నారు. దీంతోపాటు ఆయన అదనపు కమాండెంట్‌గా కొనసాగుతున్నారు.

650 మంది సిబ్బంది పహారా
ఇక నుంచి ఈ కొత్త సచివాలయానికి 650 మంది సిబ్బంది పహారా కాయనున్నారు. మూడు పటాలాల టిఎస్‌ఎస్పీ సిబ్బందిని సచివాలయ భద్రత కోసం వినియోగిస్తారు. 300 మంది వరకు సాయుధ రిజర్వ్ – ఏఆర్ సిబ్బందితో పాటు శాంతిభద్రతల పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు.

ఎంపిక చేసిన సిబ్బందికి శిక్షణ
ఎంపిక చేసిన సిబ్బందికి ఇప్పటికే మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. సచివాలయానికి నాలుగు వైపులా ఉన్న సెంట్రీ పోస్టులతో పాటు ప్రవేశ మార్గాల వద్ద ఉన్న పోస్టుల వద్ద సాయుధ సిబ్బంది నిరంతరం పహారా కాయనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రధాన ప్రవేశ ద్వారం తదితర కీలక ప్రదేశాల్లోనూ సాయుధ సిబ్బంది పహారా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News