వంద కోట్లతో పార్కులను అభివృద్ధి చేశాం : టిఎస్‌ఎఫ్‌ఎసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అటవీ అభివృద్ధి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా వంద కోట్లతో పార్కుల అభివృద్ధిని చేపట్టినట్లు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. టిఎస్‌ఎఫ్‌ఎసి అధ్వర్యంలో మంగళవారం చిలుకూరు మృగవాని రిసార్ట్స్‌లో ప్రకృతి పర్యాటకం’ (ఏకో టూరిజం)పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,అటవీశాఖ ప్రధాన అధికారి ఆర్‌ఎం డొబ్రియాల్, ఎండి డాక్టర్ జి. చంద్రశేఖర్రెడ్డి, ఎకో -టూరిజం ఈడి ఎల్. రంజిత్ నాయక్, అటవీశాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో 30 లక్షల మంది ఉద్యోగులతో పాటు ప్రజలు ఉపాధి పొందుతున్నారని, వారందరికి స్వచ్ఛ మైన వాతావరణంలో కూడిన పార్కులు. వాకింగ్ ట్రాక్‌లు అందుబాటులోకి తీసుకురావడానికి తమ సంస్థ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో ముందుకెళ్తోందన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధితో పాటు సత్తుపల్లిలో అటవీ అభివృద్ధి సంస్థ విజయవంతంగా ప్రకృతి పర్యాటక కేంద్రాలను సిద్ధం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాల ద్వారా 300 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. కేరళ, కర్నాటక మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధిచేసి, దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్తామన్నారు. ఏకో టూరిజంలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలుపుతాం అని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. దక్కన్ ఉడ్ అండ్ ట్రయల్స్ లోగోను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కల వల్ల రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేధికలు వెల్లడించినట్లు తెలిపారు. ఏకో టూరిజం అభివృద్ధి వల్ల స్థానికులకు జీవనోపాధి లాభించనుందన్నారు. ప్రకృతి పర్యాటకంపై ఆయా ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
జిల్లాకో ఏకో -టూరిజం పార్కు : చంద్రశేఖర్‌రెడ్డి
రాష్ట్రాన్ని ప్రకృతి పర్యాటకంలో దేశంలోనే ఉన్నత స్థానంలో నిలపడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు టిఎస్‌ఎఫ్‌ఎసి వైస్ చైర్మన్, ఎండి డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎకో -టూరిజం నిర్వాహణలో ఎదురయ్యే ఒడిదుదుకులు, తీసుకోవలసిన చర్యల పై వివిధ రాష్ట్రాల్లో ఏకో టూరిజం నిర్వహిస్తున్న ప్రతినిధి వర్గం, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికార వర్గాలతో మేధోమధనం చేసి రాష్ట్రంలో ప్రకృతి పర్యాటక అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. సదస్సుల్లో పిసిసిఎఫ్ హరితహారం సువర్ణ, అమ్రాబాద్ టైగర్ రిజర్వూ ఫీల్డ్ డైరెక్టర్ – క్షితిజ, అటవీశాఖ అధికారులు రామలింగం, ప్రసాద్, సునీల్, శంకరన్, కైలాస్, తిమ్మారెడ్డి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.