న్యూఢిల్లీ : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటు పెంపు తర్వాత బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరోసారి రుణ రేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్)ని 20 బేసిస్ పాయింట్లు పెంచగా, అదే సమయంలో బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎస్‌బిఐ కొత్త రేట్లు ఆగస్టు 15 నుండి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ఆర్‌బిఐ వరుసగా మూడోసారి రెపో రేటును పెంచింది, ఆ తర్వాత బ్యాంకుల రుణాలు ఖరీదైనవిగా మారుతున్నాయి. ఎస్‌బిఐ ఎంసిఎల్‌ఆర్ పెంచిన తర్వాత, గృహ రుణం, కారు రుణం, విద్యా రుణం, వ్యక్తిగత రుణాలతో సహా అనేక రకాల రుణాలు ఇప్పుడు ఖరీదైనవిగా మారతాయి. అలాగే బ్యాంకు ఖాతాదారులు ఖరీదైన ఇఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ఎఫ్‌డి చేయడానికి గరిష్టంగా 6.75% వడ్డీని పొందుతారు. ఇప్పటికే యాక్సిస్, కెనరా, యస్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచాయి. అయితే
7.35 శాతానికి ఎస్‌బిఐ రుణ రేటు
మూడు నెలల కాలానికి ఎస్‌బిఐ ఎసిఎల్‌ఆర్‌ని 7.15 శాతం నుండి 7.35 శాతానికి పెంచింది. 6 నెలల ఎంసిఎల్‌ఆర్ రేటు 7.45 శాతం నుండి 7.65 శాతానికి పెరిగింది. ఒక సంవత్సరానికి ఎంసిఎల్‌ఆర్ 7.50 శాతం నుండి 7.70 శాతానికి, రెండేళ్లకు 7.7 నుండి 7.9 శాతానికి, మూడేళ్లకు 7.8 నుండి 8 శాతానికి పెంచింది. గత నెలలో ఎస్‌బిఐ ఎంసిఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. గత మూడు నెలల్లో ఆర్‌బిఐ మూడు దశల్లో రెపో రేటును 1.40 శాతం పెంచగా, దీంతో రెపో రేటు 5.40 శాతానికి పెరిగింది. ఆ తర్వాత బ్యాంకులు ఆర్‌బిఐ నుంచి రుణాలు తీసుకోవడం ఖరీదైనది కావడంతో ఇప్పుడు బ్యాంకులు ఖాతాదారులపై భారం మోపుతున్నాయి.