ప్రగతిభవన్‌లో మ.2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన భేటీ
-అజెండాలో 25- 30 అంశాలు
-ఒమిక్రాన్ వేరియంట్, కరోనావ్యాప్తి, నైట్ కర్ఫ్యూ అవసరాలపై చర్చ
-వైద్యఆరోగ్య శాఖలో టిఎస్‌ఎస్‌ఎస్‌హెచ్‌ఐఎస్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర
-ఛనాక – కొరాటా బ్యారేజీ తుది అంచనాలు, మల్లన్నసాగర్ – తాపస్‌పల్లి లింక్ కెనాళ్లకు ఆమోదం
-317 జివొ ప్రకారం స్పౌజ్, ప్రిఫరెన్షియల్ కేటగిరీ, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్లపై చర్చ
రాష్ట్ర విభజన సమస్యల మీటింగ్ మినిట్స్‌ను కేబినెట్‌కు బ్రీఫ్ చేయనున్న సిఎస్
-యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీవిరమణ వయసు పొడిగింపుపై నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రగతిభవన్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో 25 నుంచి 30 అంశాలు అజెండాలో ఉండే అవకాశం ఉందని సిఎం కార్యాలయ వర్గాలు క ప్రకటనలో పేర్కొన్నాయి. వీటిలో ప్రాధాన్యత ఉన్న కొన్ని సిఎం కెసిఆర్ ఆమోదంతో ఐటమ్స్‌గా మంత్రివర్గం ముందుకు రానున్నాయని, అదేవిధంగా అన్ని అంశాలపై క్యాబినెట్ సానుకూలంగా సమాలోచనలు జరిపి సిఎం ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు జిఎండి క్యాబినెట్ విభాగంలో 11 ఫైళ్లున్నాయి. అత్యంత ప్రాధాన్యం ఉన్న మరో 5 దస్త్రాలు వివిధ శాఖల నుంచి క్యాబినెట్ కు చేరాల్సి ఉంది. ఇవికాక జలవనరుల శాఖ నుంచి మరో 10, విద్యాశాఖ నుంచి 2, వైద్యఆరోగ్య శాఖ నుంచి మరో 2 కి పైగా అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, రోజూ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు, దాని నియంత్రణపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడి కోసం అవసరమైతే ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించే అవకాశాలను మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు
రాష్ట్రంలో కొత్త ఆసుపత్రుల నిర్మాణం చేసి, అన్ని దవాఖానాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఆసుపత్రుల్లో ఆధునిక వసతులతో మౌళిక సదుపాయాలు కల్పించడం, ప్రభుత్వ వైద్యశాలలు, పథాలాజికల్ ల్యాబులు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ స్కూళ్లలో వసతులు పెంపొందించడంలాంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఓ సమగ్ర కార్యాచరణను రూపొందించింది. వీటన్నిటికీ రోడ్ మ్యాప్ ను రూపొందించి, నిధులు సమకూర్చుకొని, నిర్మాణాలు చేపట్టి, సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం డిసెంబర్‌లో తెలంగాణా స్టేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సోమవారం జరిగే క్యాబినెట్‌లో ప్రభుత్వం దీనికి ఆమోదం తెలపనుంది. దేశంలో మరెక్కడా లేనివిధంగా ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ధరణీ పోర్టర్‌ను విన్నూత్నంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
దాని ఆచరణ క్రమంలో పోర్టల్లో తలెత్తుతున్న సమస్యల అధ్యయనం, వాటి పరిష్కారాల కోసం ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ ఓ నివేదిక రూపొందించింది. ఉపసంఘం చేసిన సిఫారసులపై చర్చించి క్యాబినెట్ వాటిని ఆమోదించే అవకాశం ఉంది. విద్యాశాఖలో యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీవిరమణ వయసు పెంచాల్సి ఉంది. వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ ను మెడికల్ ప్రొఫెసర్ల మాదిరి 65 కు పెంచాలా, లేక ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో 61 కి పెంచాల అనే మీమాంస ఉంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక జివొ ఎంఎస్ 3, 2017 ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో నియనించాల్సిన 200 హ్యాండీక్యాప్డ్ కోటా టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
ప్రాజెక్టులపై
మల్లన్నసాగర్- తాపస్‌పల్లి లింక్ కెనాల్ అంచనా, ఛనాక – కొరాటా బ్యారేజీ తుది అంచనాల ప్రతిపాదనలతో పాటు ఇరిగేషన్ శాఖ నుంచి మరో 5 ఫైళ్లు రేపటి క్యాబినెట్ ఆమోదం కోసం రానున్నట్లు సమాచారం. వీటితోపాటు ఇప్పటికే ఏర్పాటైన మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్, గట్టు, ముక్త్యాల – జన్పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, దేవాదుల ప్రాజెక్టులో 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల కోసం ఇచ్చిన పరిపాలనాపరమైన ఆమోదాల ఫైళ్లు రాటిఫికేషన్ కోసం క్యాబినెట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి ఉత్వర్వుల ప్రకారం
మరోవైపు 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన కొత్త జోనల్ వ్యవస్థ అమలు, ఆమేరకు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు ఉద్యోగుల విభజన, వాళ్ళ పోస్టింగుల కోసం సిఎం కెసిఆర్ నిర్దేశనంలో 317 జివొ ద్వారా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి ఆ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రాసెస్ లో భాగంగా 13 అర్బన్ జిల్లాల్లో ఆగిపోయిన స్పౌజ్ కేసుల పరిశీలన, ప్రిఫరెన్షియల్ క్యాటగరీ పోస్టులు, మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ తదితర అంశాలపై కూడా మంత్రివర్గం దృష్టిసారించనుంది.
పరిపాలన సంస్కరణల కమిటీ
రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో నలుగురు ఐఎఎస్‌లతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి నలుగురు ఐఎఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజి అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన సిఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాలలో సర్దుబాటు చేయగా, 101 మంది మినహా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాలలో చేరిపోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎంఎల్‌సి వెంకట్రామిరెడ్డి, ఎంఎల్‌ఎలు సి.లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు,సిఎంవొ అధికారులు శేషాద్రి, స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు.