Friday, September 20, 2024

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరుగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తొలుత సచివాలయంలో నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్‌కు మారింది. మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో మంగళవారం ఉదయం ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుపై ఈ సమావేశం చర్చించనుంది. ఆ తర్వాత అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది. ఈ అంశానికి తోడు కొత్త రేషన్ కార్డుల జారీపైనా కేబినెట్ చర్చించి విధి, విధానాలను ఖరారు చేయనున్నారు. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిల మధ్య నిర్వహించిన ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్‌లో వచ్చిన అభయహస్తం దరఖాస్తుల్లో కొత్త రేషన్ కార్డుల జారీ దరఖాస్తులపై స్పెషల్ కమిటీ ఇప్పటికే లోతుగా అధ్యయనం చేసింది.

కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు జారీ చేస్తారంటూ ప్రజల నుంచి ఇటు విపక్షాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్దిష్టమైన విధి, విధానాలను, అర్హతలను, జారీకి సంబంధించి షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశమున్నట్టుగా తెలిసింది. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసీ ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజనల్ రింగురోడ్డు నిర్మాణం, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ తదితర పలు అంశాలకు సంబంధించి కూడా చర్చించనున్నట్లుగా తెలిసింది. ఇందులో కొన్ని పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నందున కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News