Wednesday, January 22, 2025

ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంపై రాష్ట్ర మంత్రుల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై రాష్ట్ర మంత్రులు నిప్పులు చెరిగారు. తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపి పార్టీ, ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడానికి రాష్ట్రానికి వచ్చారని వారు విమర్శించారు. రాష్ట్రానికి ఎవరూ వచ్చినా కెసిఆర్‌ను విమర్శించడం అలవాటుగా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. శనివారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో విమర్శిస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మోడీ అనడం సిగ్గుచేటని అన్నారు. కెసిఆర్ గొప్పతనం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు ఇచ్చామని ప్రధాని అంటున్నారని, మీరు డబ్బులు ఇవ్వలేదు, మాకు రావాల్సిన నిధులను ఆపారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. బిజెపికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని, మీకు ఈడీ, సిబిఐ అండగా ఉండొచ్చని, తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
బెదిరించేవారు ప్రధాని అవుతారా ? మంత్రి వేముల
వరంగల్‌లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి రాజు ప్రధాని మోడీ అని మంత్రి వేముల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రముఖ జాతరల్లో ఒక్కటైనా మేడారం జాతరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని వారు ఈరోజు వరంగల్ వచ్చి మాట్లాడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇది ట్రైలర్ అని బెదిరించేవారు ప్రధాని అవుతారా అని మంత్రి వేముల ప్రశ్నించారు. దేశంలో బిజెపి మత రాజకీయాలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు. బిజెపి ఇచ్చిన హామీలన్ని నిలబెట్టుకోవాలంటే మరో 50 ఏళ్లు పడుతోందని మంత్రి వేముల ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News