Friday, November 22, 2024

రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం

- Advertisement -
- Advertisement -

బిసిల సింహగర్జన సభలో జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిలు రాయితీలు, సంక్షేమ పథకాలకు రాజీ పడకుండా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజకీయ అధికారం, కులానికో సీటు, బిసిలకే ఓటు అనే ఎజెండాతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలకు జనాభా దామాషా ప్రకారం 60 అసెంబ్లీ స్థానాలు, బిసిలకే ముఖ్యమంత్రి పీఠం దక్కాలనే డిమాండ్ తో ఆదివారం సాయంత్రం సరూర్నగర్ స్టేడియం, గద్దరన్న ప్రాణగణంలో నిర్వహించిన బిసిల సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. ప్రతి రాజకీయ పార్టీ బిసి కులాలకు 60 శాతం సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంక్షేమ పథకాలు సాగిలపడి అడుక్కునే పరిస్థితి లేకుండా రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తామన్నారు. బిసిలకు 60 సీట్లు కేటాయిస్తే ప్రతి ఒక్కరిని అసెంబ్లీకి పంపే బాధ్యత తామే తీసుకుంటామని జాజుల అన్నారు. లేదంటే ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాజకీయ అధికారం కోసం ఎంతవరకైనా పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 60 శాతం సీట్లు కేటాయించకపోతే రానున్న కాలంలో బిసిలకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి అధికారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో బస్సు యాత్ర చేపడుతామని ప్రకటించారు.

కేంద్రం ప్రవేశపెట్టే మహిళా బిల్లులో బిసి కోటా ఉంటేనే స్వాగతిస్తామని అన్నారు. రాజకీయ లడాయి కోసమే సింహగర్జన ఏర్పాటు చేసినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాజకీయ పార్టీల కతీతంగా నిర్వహించిన సింహగర్జన మహాసభకు బిసి ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థులు యువజనులు, మేధావులు కళాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చారిత్రాత్మకంగా నిర్వహించిన బిసి సింహగర్జనలో బిసిలంతా స్వచ్ఛందంగా పాల్గొని బిసిల రాజకీయ ఐక్యతను, బిసిల రాజకీయ ఆకాంక్షలను ఈ మహాసభ ద్వారా తెలియజేశామన్నారు. ఈ సమావేశంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, తాడూరి శ్రీనివాస్, కుల్కచర్ల శ్రీనివాస్, కనకాల శ్యామ్, |బాలరాజుగౌడ్, గోపగోని వెంకటనారాయణ, చక్రహరి రామరాజు, విక్రమ్ గౌడ్, వడ్లకొండ వేణుగోపాల్, నరాల సుధాకర్, భాగ్యలక్ష్మి, పిట్ల కృష్ణ, మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News