రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలకు రంగం సిద్దం చేసింది. రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో విజయోత్సవాలను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
వచ్చే నెల 7వ తేదీకి రేవంత్ సర్కారు ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రజా పాలన – విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈమేరకు ప్రజాపాలన- విజయోత్సవాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష చేశారు. ప్రజాపాలన-విజయోత్సవాల్లో శాఖలవారీగా, విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు సిఎం రేవంత్ రెడ్డి.
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిఎం ఆదేశించారు. ఈసందర్భంగా డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సిఎంకు వివరించారు అధికారులు. ఈ నెల 19న వరంగల్ వేదికగా.. 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సిఎం రేవంత్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇక డిసెంబర్ 7,8,9 తేదీల్లో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేసింది. డిసెంబర్ 7న ట్యాంక్‌బండ్‌పై , 8న సచివాలయంలో, 9న నెక్లెస్‌రోడ్‌లో విజయోత్సవ వేడుకలు జరపనున్నారు. విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు.