కేంద్రానికి కేజ్రీవాల్ హితవు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలతో నిత్యం కీచులాడే బదులు వాటితో కలసి కేంద్రం పనిచేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హితవు పలికారు. ప్రజలకు రేషన్, ఆక్సిజన్ అందచేయడంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ఆరోపణలకు చెందిన పత్రికా వార్తను ట్యాగ్ చేస్తూ కేజ్రీవాల్ శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందిస్తూ 130 కోట్ల మంది ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలసి టీమ్ ఇండియాగా పనిచేస్తేనే దేశం అభివృద్ధి చెందగలదని వ్యాఖ్యానించారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాలను దూషిస్తూ, వారితో కీచులాడే కేంద్రం స్థానంలో అందరినీ కలుపుకుని పోయే నాయకత్వాన్ని ప్రజలు ఈనాడు కోరుకుంటున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను దూషించడం తగదని కూడా ఆయన కేంద్రానికి హితవు చెప్పారు.