న్యూఢిల్లీ: రాష్ట్రాల నుంచి ఐఎఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి సరిపడినంత సంఖ్యలో పంపడంలేదని కేంద్రం తెలిపింది. దాంతో, కేంద్ర ప్రభుత్వ నిర్వహణకు ఇబ్బంది తలెత్తుతున్నదని, అందువల్లే నిబంధనల్ని మార్చాలని నిర్ణయించినట్టు సిబ్బంది శిక్షణ వ్యవహారాలశాఖ(డిఒపిటి) తెలిపింది. జాయింట్ సెక్రటరీస్థాయి అధికారుల వరకు కేంద్రానికి కొరత ఏర్పడిందని తెలిపింది. చాలా రాష్ట్రాలు సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్(సిడిఆర్) కోసం పంపుతున్న అధికారుల సంఖ్య తక్కువగా ఉన్నదని తెలిపింది. సిడిఆర్‌లో 2011లో ఐఎఎస్ అధికారుల సంఖ్య 309కాగా, ఇప్పుడది 223కు తగ్గిందని డిఒపిటి పేర్కొన్నది.
ఇప్పటివరకూ అమలులో ఉన్న నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో డిప్యుటేషన్‌పై అధికారులను పంపేవారు. ఈ నిబంధనల్లో మార్పులను కేంద్రం ప్రతిపాదించింది. గతేడాది 12న రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ఈ నెల 25లోగా స్పందన తెలియజేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీనిపై బెంగాల్ సిఎం మమతాబెనర్జీ ఘాటుగా స్పందించారు. నిబంధనల్ని మార్చొద్దని ఆమె ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్రం తన ఇష్టానుసారం అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకుంటే రాష్ట్రాల్లో పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆమె ఆ లేఖలో తెలిపారు.