హైదరాబాద్: కేంద్ర పథకాల వినియోగానికి కఠిన నిబంధనలు విధించడం మంచిది కాదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర పథకాలు పొందడంలో రాష్ట్రాలకు ఇబ్బందులు ఉన్నాయని, రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్ర పథకాల రూపకల్పన చేయాలని సలహా ఇచ్చారు. ప్రజాభవన్‌లో ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగఢియా నేతృత్వంలో 16వ ఆర్థిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. పన్నుల ఆదాయం వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచారని, కేంద్రపథకాల రూపకల్పనకు స్వయంప్రతిపత్తి అందించాలని, రూ.6.85 లక్షల కోట్ల రుణభారంతో తెలంగాణ సతమతమవుతోందని, సెస్‌లు, సర్‌ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు.
స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉందని, మౌలిక సౌకర్యాల కల్పనతో సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేస్తామన్నారు. ఇది తెలంగాణ డిమాండ్ కాదు… అన్ని రాష్ట్రాలకు సంబంధించినదని, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న సంపద, ఆదాయ మధ్య అంతరం ఉందని భట్టి తెలియజేశారు. అసమానతల కారణంగా తెలంగాణ సాధన ఉద్యమం ప్రారంభమైందని, అసమానతల పరిష్కారానికి మౌళిక సౌకర్యాలు, సంక్షేమంపై ఖర్చు చేయాలని సూచించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటిదని, తెలంగాణ ప్రజలకు ఆర్థిక భరోసా అధిక భద్రత కల్పిస్తున్నాయని వివరించారు. ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, సిఎస్‌లు హాజరయ్యారు.