రూ. 20 వేలు లంచం తీసుకుంటూ స్టేషన్ ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ రెడ్‌హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులకు పట్టుబడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిల్పూరు మండలం వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన బట్టమేకల యాదగిరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరికీ తమ ఆస్తిలోని ఇల్లు, ఖాళీ స్థలాన్ని సమానంగా పంచాలనే ఉద్దేశంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇద్దరు కుమారులు బట్టమేకల శివరాజు, ధర్మరాజు వచ్చారు. 500 గజాల ఇంటి స్థలాని రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా పార్ట్.1 ,పార్ట్ 2గా చేస్తానని అందుకు గాను రూ. 22 వేలు ఇవ్వాలన్నారు. దీంతో ఇద్దరు కుమారులు డబ్బులు ఎక్కువగా అవుతున్నాయని చెప్పడంతో మధ్యవర్తి వారి వద్దకు వచ్చి ఒప్పందం కుదుర్చుకొని రూ. 20 వేలకు ఒప్పుకున్నారు.
శివరాజు హన్మకొండలోని ఎసిబి డిఎస్పి సాంబయ్య కు సమాచారం ఇచ్చాడు. పథకం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రూ. 20 వేలు రామకృష్ణ వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్న రమేశ్‌కు అందిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఎసిబి ఆఫీసులో సరెండర్ చేస్తున్నట్లు ఎసిబి డిఎస్పి సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అక్రమంగా డబ్బులు అడిగినా.. ఇబ్బందులకు గురిచేసినా మాకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎల్. రాజు, ఎస్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.