కోల్‌కతా : వక్ఫ్ (సవరణ) చట్టం పశ్చిమ బెంగాల్‌లో అమలు కాదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం విస్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రంలో హింసాత్మక నిరసనల నడుమ మమత ఆ స్పష్టీకరణ ఇచ్చారు. ఆ చట్టాన్ని కేంద్రం చేసిందని, సమాధానాలను కేంద్రం నుంచే కోరాలని మమత అన్నారు. ‘అన్ని మతాల ప్రజలకు నా మనవి, దయచేసి ప్రశాంతంగా ఉండండి, సంయమనంతో వ్యవహరించండి. మతం పేరిట ఎటువంటి మత వ్యతిరేక చర్యలకూ దిగకండి. ప్రతి మానవ ప్రాణం విలువైనది; రాజకీయాల కోసం అల్లర్లను ప్రేరేపించకండి. అల్లర్లను ప్రేరేపించేవారు సమాజానికి హాని చేస్తున్నారు’ అని మమత ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్త చట్టంపై శుక్రవారం నిరసనలు వెల్లువెత్తినప్పుడు మాల్డా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో దౌర్జన్య సంఘటనలు ప్రజ్వరిల్లగా పోలీసు వ్యాన్లతో సహా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు, భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు, రోడ్లపై అవరోధాలు ఏర్పాటు చేశారు.
‘అనేక మందిని ఆగ్రహానికి గురి చేసిన ఆ చట్టాన్ని మేము చేయలేదని గుర్తు ఉంచుకోండి. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. కనుక మీకు కావలసిన సమాధానానికి కేంద్ర ప్రభుత్వాన్నే అడగండి’ అని సిఎం అన్నారు. ‘ఈ విషయమై మా వైఖరిని మేము స్పష్టం చేశారు. మేము ఆ చట్టాన్ని సమర్థించడం లేదు. మన రాష్ట్రంలో ఆ చట్టం అమలు జరగదు. మరి అల్లర్లు దేని గురించి’ అని ఆమె అన్నారు. అల్లర్లను ప్రేరేపించేవారిపై చట్టపరమైన చర్య తీసుకోనున్నట్లు మమత స్పష్టం చేశారు. ‘మేము ఎటువంటి హింసాత్మక చర్యనూ క్షమించడం లేదు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం మతాన్ని దుర్వినియోగం చేయజూస్తున్నారు. వారి మాటలకు లొంగకండి’ అని ఆమె అన్నారు. ‘మతం అంటే మానవత్వం, సుహృద్భావం, నాగరికత, సామరస్యం అని నా భావన. శాంతి, సామరస్యాలను పరిరక్షించాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మమత తెలిపారు.