న్యూఢిల్లీ : కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబయి రెడ్ జోన్‌లో ఉన్నాయని, దేశ రాజధానిలో మూడు రోజుల ఉంటే అనారోగ్యం పాలవడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగిత దేశ రాజధానిలో నివసించే ప్రజల ఆయుర్దాయం పది సంవత్సరాలు తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికైనా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని మంత్రి సూచించారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఆర్థిక వ్యవస్థకుఇచ్చే ప్రాధాన్యాన్ని పర్యావరణానికి కూడా ఇవ్వాలనే అభిప్రాయాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. కాలుష్యానికి పెట్రోల్, డీజెల్ ప్రధాన కారణమని ఆయన అన్నారు. వాహనాల్లో ఉపయోగించే ఇంధనంలో మార్పు అవసరమని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు, భారత్ సుమారు రూ. 22 లక్షల కోట్లు విలువ చేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నదని ఆయన గుర్తు చేశారు.
వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించవలసిన సమయం ఆసన్నమైందని గడ్కరీ అన్నారు. 5 ట్రిలియిన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్షంగా భారత్ ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ రంగాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలియజేశారు. అభివృద్ధి చెందిన దేశాల లాజిస్టిక్ ఖర్చులు 12 శాతం లోపు ఉంటే మన ఖర్చులు 16 శాతం ఉన్నాయని ఆయన చెప్పారు. వచ్చే సంవత్సరం చివరి నాటికి మన ఖర్చులను సింగిల్ డిజిట్‌కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని గడ్కరీ స్పష్టం చేశారు.