2030 నాటికి 190 మిలియన్ టన్నులు అవసరం
కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రా రంగాలదే 60% వాటా: స్టీల్‌మింట్ నివేదిక
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉక్కు డిమాండ్ పెరుగుతోంది. 2030 నాటికి 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో 190 మిలియన్ టన్నులకు డిమాండ్ చేరుకుంటుందని స్టీల్‌మింట్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, మొత్తం డిమాండ్‌లో 60- నుంచి 65 శాతం వాటా నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల ద్వారా ఉంటుంది. ‘ఇండియాస్ స్టీల్ అండ్ కోకింగ్ కోల్ డిమాండ్ 2030’ పేరుతో రూపొందించిన నివేదిక ప్రకారం, 2030 నాటికి మొత్తం డిమాండ్ 230 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని పేర్కొంది. ఆటో, ఇంజినీరింగ్ వంటి రంగాల ద్వారా కూడా డిమాండ్ పెరుగుతుంది.
జనాభా పెరుగుదల, పెరుగుతున్న పట్టణీకరణ, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు మొదలైనవి స్టీల్ డిమాండ్ పెరగడానికి ప్రధాన కారకాలుగా ఉన్నాయి. నివేదిక ప్రకారం, 2023 చివరి నాటికి డిమాండ్ 12 కోట్ల టన్నులకు చేరుకుంటుందని, ఉత్పత్తి 13.6 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. అలాగే భారతదేశం ముడి ఉక్కు ఉత్పత్తి 2030 నాటికి 21 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. ఇది 2023 ఉత్పత్తి స్థాయిల కంటే 45 శాతం పెరుగుదల ఉంది.
చైనాలో తగ్గుతున్న ఉత్పత్తి
ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి స్థాయిలతో పోలిస్తే చైనాతో పాటు పలు దేశాల్లో ఉక్కు ఉత్పత్తి తగ్గుతుందని నివేదిక పేర్కొంది. సమీప భవిష్యత్తులో భారతదేశం 30 శాతం మార్కెట్ వాటాతో అతిపెద్ద సముద్ర బొగ్గు దిగుమతిదారుగా అవతరించనుంది. 2030 నాటికి దేశానికి దాదాపు 350 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం అవసరం అవుతుంది. 2030 సంవత్సరం దేశీయ ఉక్కు పరిశ్రమకు ముఖ్యమైనది, ఎందుకంటే భారతదేశం ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 300 మిలియన్ టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.