చెమటోడ్చిన అజరెంకా, జ్వరేవ్, రెండో రౌండ్లో మెద్వెదేవ్, కీస్, ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), 23వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) శుభారంభం చేశారు. ఇక 15వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్), 20వ సీడ్ మార్కెటా వొండ్రుసొవా (చెక్) తొలి రౌండ్లో విజయం సాధించారు. ఇక పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), ఐదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస) రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రస్తుత చాంపియన్, 8వ సీడ్ ఇగా స్వియాటెక్ తొలి రౌండ్లో విజయం సాధించింది. చెక్ క్రీడాకారిణి కాజా జువాన్‌తో జరిగిన పోరులో ఇగా 60, 75 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్లో ఇగాకు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన ఇగా ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే సెట్‌ను సొంతం చేసుకుంది. కానీ రెండో సెట్లో ఇగాకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్లో ఇగా గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా చెమటోడ్చి నెగ్గింది. రష్యా క్రీడాకారిణి స్వెట్లెనా కుజునెత్సొవాతో జరిగిన పోరులో అజరెంకా 64, 26, 63తో విజయం సాధించింది. మరో పోటీలో రష్యా క్రీడాకారిణి వెరోనికా 76, 61తో అమెరికాకు చెందిన అమందా అమినిసెవాను ఓడించింది. మరోవైపు 14వ సీడ్ ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం), 23వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) తొలి రౌండ్లో విజయం సాధించారు. హోరాహోరీ పోరులో కీస్ 63, 36, 61తో ఫ్రాన్స్‌కు చెందిన డొడిన్ను ఓడించింది. తొలి సెట్లో గెలిచిన కీస్‌కు రెండో సెట్లో చుక్కెదురైంది. అయితే మూడో సెట్లో మళ్లీ పుంజుకున్న కీస్ అలవోక విజయంతో ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో మెర్టెన్స్ 64, 61తో స్ట్రోమ్ సండర్స్ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేసి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఇక వొండ్రుసొవా (చెక్) తొలి రౌండ్లో 46, 63, 60తో కనెపి (ఇస్టోనియా)ను ఓడించింది. కాగా 16వ సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పొలొనా హర్కాగ్ (స్లోవేనియా)తో జరిగిన మ్యాచ్‌లో బెర్టెన్స్ 16, 64, 46తో పరాజయం పాలైంది.
గట్టెక్కిన జ్వరేవ్
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) తొలి రౌండ్లో అతి కష్టం మీద విజయం సాధించాడు. తన దేశానికే చెందిన క్వాలిఫయర్ ఆస్కార్ ఒట్టేతో జరిగిన ఐదు సెట్ల మారథాన్ సమరంలో విజయం సాధించి ముందంజ వేశాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో జ్వరేవ్ 36, 36, 62, 62, 60తో జయకేతనం ఎగుర వేశాడు. తొలి రెండు సెట్లలో జ్వరేవ్‌కు చుక్కెదురైంది. అయితే అసాధారణ పోరాట పటిమను కనబరిచిన జ్వరేవ్ ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో పోటీలో రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ అలవోక విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. కజకిస్థాన్ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్‌తో జరిగిన పోరులో డానిల్ 63, 6౫3, 75తో జయభేరి మోగించాడు. మరోవైపు ఐదో సీడ్ సిట్సిపాస్ కూడా తొలి రౌండ్లో విజయం సాధించాడు. ఫ్రాన్స్‌కు చెందిన జెర్మి చార్డితో జరిగిన పోరులో సిట్సిపాస్ 76, 63, 61తో జయకేతనం ఎగుర వేశాడు. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీని ఎదుర్కొన్న సిట్సిపాస్ తర్వాతి సెట్లలో పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అలవోక విజయంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇతర పోటీల్లో 18వ జానిక్ సిన్నర్ (ఇటలీ), 15వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), జాన్ ఇస్నర్ (అమెరికా) తదితరులు విజయం సాధించారు.
బియాంకా ఇంటికి..
మరోవైపు మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ బియాంకా అండ్రెస్కూ (కెనడా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. హోరాహోరీ పోరులో బియాంకా స్లోవేనియాకు చెందిన టమరా జిడాన్సెక్ చేతిలో ఓటమి పాలైంది. నరాలు తెగేంత ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో టమరా 67, 76, 97తో బియాంకు ఓడించింది. మూడు సెట్ల టైబ్రేకర్ సమరంలో ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడినా చివరికి విజయం మాత్రం టమరాకే వరించింది.