Monday, December 23, 2024

వైద్య చరిత్రలో మరో అద్భుతం.. ఈ చికిత్సతో ఎయిడ్స్ మాయం

- Advertisement -
- Advertisement -

గతకొన్నేళ్లుగా మానవులను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌ను మూలకణ మార్పిడి (stem cell transplantation) ద్వారా పూర్తిగా నయం చేయగలిగారు. వైద్య చరిత్రలో ఇది మరో అద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా హెచ్‌ఐవి, ఎయిడ్స్ వ్యాధులకు సరైన మందనేది లేదు. చికిత్స కూడా ఉండేది కాదు. కేవలం నివారణ ఒకటే మార్గం అని ప్రతిసారీ వింటుండేవాళ్లం. గత మూడు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవి, ఎయిడ్స్ ను నిర్మూలించడానికి శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇన్నాళ్లకు వారి శ్రమ ఫలించినట్టు కనిపిస్తోంది. తాజాగా హెచ్‌ఐవి సోకిన రోగికి, అదీనూ మొట్టమొదటిసారి ఓ మహిళకు కొత్త ప్రక్రియతో విజయవంతంగా చికిత్స అందించి అమెరికా వైద్య నిపుణులు కొత్త రికార్డు నెలకొల్పారు.

దీంతో మానవ చరిత్రలో ఎయిడ్స్ సంపూర్ణంగా నయమైన మూడో పేషెంట్‌గా ,తొలి మహిళా పేషెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఆమె కంటే ముందుగా హెచ్‌ఐవి రోగులైన ఇద్దరు పురుషులు ఈ మహమ్మారి నుంచి బయటపడిన ఉదంతాలు ఉన్నాయి. వారిలో ఒకరు బెర్లిన్ పేషెంట్‌గా పిలిచే టిమోతీ రే బ్రౌన్ అనే మగ పేషెంట్ కాగా, మరొకరు లండన్ పేషెంట్ అనే ఆడమ్ కాసిల్జో అనే వ్యక్తి. వీరిద్దరికీ మూలకణాల మార్పిడి జరిగింది. అయితే ఆ మూలకణాలు పెద్దల నుంచి తీసుకోవడమైంది. వీరి తర్వాత మహిళా పేషెంట్ ఎయిడ్స్ నుంచి ఉపశమనం పొందింది.

మూలకణ మార్పిడి తరువాత ఆమె 14 నెలలుగా యాంటీవైరల్ థెరపీ తీసుకోవడం లేదని , అయినా ఆమెలో హెచ్‌ఐవి వైరస్ కనిపించలేదని పరిశోధకులు వివరించారు. ఈ మహిళకు 2013లో హెచ్‌ఐవి ఉన్నట్టు నిర్ధారణ అయింది. నాలుగేళ్ల తరువాత లుకేమియా కూడా ఉన్నట్టు తేలింది. ఈ బ్లడ్ క్యాన్సర్‌కు హ్యాప్లో ( ఏక క్రోమోజోమ్)మార్పిడి ద్వారా చికిత్స జరిగింది. ఇందులో పాక్షికంగా సరిపోలిన దాత నుంచి బొడ్డు తాడు రక్తం తీసుకున్నారు. ఈ సమయంలో సన్నిహిత బంధువులు కూడా రోగనిరోధక శక్తి పెంచడానికి రక్తదానం చేశారు. ఈమెకు చివరిసారిగా 2017లో మార్పిడి చేయగా గత నాలుగేళ్లలో లుకేమియా నుంచి పూర్తిగా కోలుకుంది.

మూడేళ్ల తర్వాత డాక్టర్లు ఈమెకు హెచ్‌ఐవి చికిత్సకూడా నిలిపి వేశారు. దీంతో ఆమె ఇప్పుడు పూర్తిగా హెచ్‌ఐవి నుండి పూర్తిగా విముక్తి పొందినట్టు డాక్టర్లు వివరించారు. ఈమె పూర్తిగా కోలుకోవడంతో భవిష్యత్తులో ఎయిడ్స్ పూర్తిగా నిర్మూలించేందుకు కొత్తగా ఆశలు రేకెత్తుతున్నాయి. అయితే మూలకణాల మార్పిడి అన్నది అత్యంత ఖరీదైన చికిత్స. ఈ చికిత్సలో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దాత ఇమ్యూనిటీ కణాలు, గ్రహీత ఇమ్యూనిటీ కణాలపై దాడి చేయడం పెద్ద సమస్య.

తొలి రెండు చికిత్సల్లో ఈ సమస్య ఎదురైంది. కానీ ఈసారి మహిళా రోగిలోఈ సమస్య కనిపించలేదు. మూలకణాలను అందరూ దానం చేయడం కుదరదు. రక్త కణాల్లో హెచ్‌ఐవి వైరస్‌ను కట్టడి చేసే గ్రాహకాలు (రెసెప్టార్లు)ఉండని వ్యక్తిని దాతగా అంగీకరిస్తారు. అప్పుడు రోగి శరీరం లోకి ఎక్కించిన దాత మూలకణాలు కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి.ఈ కొత్త కణాలు హెచ్‌ఐవి నిరోధకాలుగా ఉంటాయి. దీంతో సదరు రోగిలో క్రమంగా వైరస్ భారం తగ్గిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News