పోలీసులతో సమావేశం
సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరోః మాదక ద్రవ్యాల సరఫరదారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. కమిషనరేట్ మెయిన్ కాన్ఫరెన్స్‌హాల్‌లో గురువారం డిసిపిలు, ఎడిసిపిలు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లతో సిపి స్టిఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. పోలీస్ స్టేషన్ల వారీగా మాదక ద్రవ్యాల కేసులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌డిపిఎస్ యాక్ట్ 1985పై పోలీసులు మరింత అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఇటీవల కాలంలో యువత డ్రగ్స్ బారినపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నాయన్నారు.
గంజాయి వినియోగం ఉన్న ప్రాంతాలను గుర్తించి దృష్టి సారించాలన్నారు. సప్లయర్స్ చైన్‌ను బ్రేక్ చేస్తే మత్తులో జరిగే నేరాలను అరికట్టే అవకాశం ఉందని అన్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు యత్నించాలని కోరారు. మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, వినియోగదారుల వివరాలు సేకరించి కేసులు నమోదు చేసి నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా చేయాలన్నారు. తరచుగా పట్టుబడే నిందితులపై పిడి యాక్ట్ ప్రయోగించాలని ఆదేశించారు. సమావేశంలో శంషాబాద్ డిసిపిలు ప్రకాష్ రెడ్డి, ఎస్‌ఎం విజయ్‌కుమార్, రోహిణిప్రియదర్శిని, పివి పద్మజా, వెంకటేశ్వర్లు, ఎస్‌ఓటి డిసిసి సందీప్ తదితరులు పాల్గొన్నారు.