Thursday, April 24, 2025

పంచాయతీల బలోపేతానికి చర్యలేవి?

- Advertisement -
- Advertisement -

చారిత్రకంగా భారతదేశంలో మొట్టమొదట చోళుల పరిపాలన వ్యవస్థ ‘స్వయం పరిపాలన’కు నాంది పలికింది. స్వాతంత్య్ర అనంతరం మన దేశంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా స్థానిక స్వపరిపాలన కోసం మూడంచెల ‘పంచాయతీరాజ్ వ్యవస్థ’ను ఏర్పాటు చేయడం జరిగినది. ఇది కిందిస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది. అదే విధంగా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష వేదికగా నిలిచింది. భారత దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే.. గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1952లో సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని(సిడిపి) ప్రారంభించింది. తదుపరి జాతీయ విస్తరణ సేవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం లేకపోవడంతో సామాజిక అభివృద్ధి కార్యక్రమం, జాతీయ విస్తరణ సేవాపథకం క్షేత్రస్థాయిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. వీటి అమలు విధానాన్ని అధ్యయనం చేసి వాటిని మరింత పటిష్టం చేయడానికి అవసరమైన సూచనల కోసం భారత ప్రభుత్వం 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచించిన ప్రజాస్వామిక వికేంద్రీకరణ విధానమే నేటి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు దారితీసింది. తదుపరి అనేక కమిటీల సిఫార్సుల మేరకు బలమైన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ కాగా, రెండవది ఆంధ్రప్రదేశ్. ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో స్థానిక సంస్థల పరిపుష్టం చేయడానికి 73 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు. దీనిని 1993, ఏప్రిల్ 24 నుంచి అమలు చేయడం జరిగింది. భారత ప్రభుత్వం అధికారికంగా 2010 నుండి ప్రతి ఏటా ఈ రోజు ‘జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం’ గా నిర్వహించడం జరుగుతుంది. ఈ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగం 9వ భాగంలో పంచాయతీల పేరుతో ఒక కొత్త అధ్యయనం చేర్చి అధికరణ 243ఎ నుండి 243ఒ వరకు నిబంధనలు పొందుపరిచారు. అదే విధంగా రాజ్యాంగంలో 11 షెడ్యూల్ అదనంగా చేర్చి, పంచాయతీరాజ్ సంస్థలు నిర్వర్తించాల్సిన 29 విధులను కూడా పొందుపరచారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో40వ అధికరణం ఆచరణీయ కార్యక్రమానికి నిదర్శనంగా పంచాయితీ రాజ్ వ్యవస్థను పేర్కొనవచ్చు. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగపరమైన హోదా కల్పించడం జరిగింది. దీనిని మొదట అమలుపరిచిన రాష్ట్రం మధ్యప్రదేశ్. గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పంచాయతీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ వ్యవస్థ ఏర్పాటు చేయబడినది. వీటి సభ్యులందరూ ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. పంచాయతీరాజ్ వ్యవస్థ మౌలిక విభాగం గ్రామం. గ్రామస్థాయిలో గ్రామసభలు రాష్ట్ర శాసనసభ నిర్దేశించిన విధంగా నిర్వహించబడతాయి. గ్రామసభలు గ్రామాభివృద్ధి ప్రణాళికను రూపొందించి ఆమోదిస్తాయి. గ్రామపంచాయతీ పౌరసరఫరాల కల్పన, మంచినీటి సరఫరా, పరిశుభ్రత, వీధిదీపాల నిర్వహణ, రోడ్లు, జననమరణాలు నమోదు, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం లాంటి అనేక అంశాలను నిర్వహించడం జరుగుతుంది. పంచాయతీ వ్యవస్థ ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లి ప్రజాసమస్యలను పరిష్కరించడంలో కీలక భూమిక పోషించినా, క్షేత్ర స్థాయిలో అనేక వైఫల్యాలను చవిచూడడం జరుగుతున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామసభలే నిర్వహించాలి. కానీ ఆచరణలో జరగడం లేదు. ఆర్థిక వనరుల కొరత స్థానిక సంస్థల స్ఫూర్తిని నీరుగారుస్త్తున్నాయి. మహిళలకు బలహీనవర్గాల వారికి చట్టపరంగా సముచిత ప్రాధాన్యత కల్పించినప్పటికీ ఆచరణలో ఆశించినమేరకు తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు. దీనికిగల కారణం తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలు, కుల వ్యవస్థ, పురుషాధిపత్యం అని పేర్కొనవచ్చు. పేదరికం, నిరక్షరాస్యత, రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల స్థానిక సంస్థల పనితీరుకు అడ్డంకిగా మారుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వడం వలన కూడా రాష్ట్రప్రభుత్వాలు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం, ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా బేఖాతరు జరుగుతుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలోనీ లోపాలను సవరించి మరిన్ని అధికారాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలోని నూతన పంచాయతీ రాజ్ చట్టం 2018 రూపొందించడం జరిగింది. ఆచరణలో మాత్రం పటిష్టంగా ముందుకుపోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గత సంవత్సర కాలంనుంచి పంచాయతీ ఎలక్షన్లు జరగడం లేదు. దీంతో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా రాక పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతున్నది. 11వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాలను పూర్తిగా స్థానిక సంస్థలకు బదిలీ జరగకపోవడం వలన వాటి పనితీరు దెబ్బ తింటున్నది. గ్రామస్థాయిలో ప్రభుత్వం నెలకొల్పిన అనేక సంఘాలు, కమిటీలు సమాంతర వ్యవస్థలుగా మారి పంచాయతీలను బలహీనపరిస్తున్నాయి. ఈ మధ్య పంచాయతీ పాలకవర్గంలో రోజురోజుకు పెరిగిపోతున్న రాజకీయ జోక్యం వలన పాలకవర్గం ప్రభుత్వ ప్రతినిధులకు అనుచరులుగా మారి పంచాయతీల స్వతంత్రను దెబ్బ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల పనితీరును బలోపేతం చేయడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ప్రతి జిల్లాలో జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేసి, పంచాయితీలకు అన్ని అధికారుల బదిలీ చేసి రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయ నిధులను కేంద్రం మంజూరు చేయాలన్నది. పంచాయతీలకు పలు అంశాలపై పన్నులు విధించే అధికారం కల్పించాలని, ఇ -పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొనడం జరిగింది. అదే విధంగా రెండో పరిపాలనా సంస్కరణల సంఘం కూడా అనేక సూచనలు చేసింది. ఇది స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ స్వయం ప్రతిపత్తి కల్పించడమే కాకుండా, స్థానిక సంస్థలకు జవాబుదారీగా ఉన్నాయి. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు పరచి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. అప్పుడే గ్రామస్వరాజ్యం సాధ్యమవుతుంది.

– సంపతి రమేష్
మహారాజ్
7989579428

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News